ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి : జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎస్పీ
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని(Telangana Public Administration Day) పురస్కరించుకుని గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఎస్పీ జాతీయ జెండా(national flag)ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికి హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో కొనసాగిందని అన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్(Union of India)లో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా భారత ప్రభుత్వం(Government of India) చేపట్టిన ఆపరేషన్ పోలో అనంతరం 1948 సెప్టెంబర్ 17 న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకున్నారు.
ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ ప్రతి ఒక్కరు అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా పారదర్శకత, బాధ్యతాయుతమైన విధానంతో విధులు నిర్వహించాలని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సబ్ డివిజన్ డీఎస్పి సంపత్ రావు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, డీపీఒ సిబ్బంది పాల్గొన్నారు.