ఏఐకి ఖర్చు.. కొలువులకు ఎసరు!
- ఐటీ దిగ్గజ సంస్థల్లో భారీగా లేఆఫ్స్
- కలవరపెడుతున్న ఒరాకిల్ ఉదంతం
- ఒక్క ఏడాదిలోనే లక్ష మందిని ఇంటికి పంపిన ఐటీ కంపెనీలు
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఒరాకిల్(Oracle)లో భారీగా ఉద్యోగాల కోతల(Job cuts) నేపథ్యంలో రూపొందించిన ఓ వీడియో సోషల్ మీడియా(Social media video)లో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నది. ఛిద్రమవుతున్న టెకీల బతుకుచిత్రాన్ని అది చూపిస్తున్నది. కంపెనీ క్యాంపస్‌ల నుంచి పెట్టెలతో బయటకు వస్తున్న ఉద్యోగులు, మరోవైపు భారీగా పెరుగుతున్న మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్)(Capital Expenditure), దానికి అనుగుణంగా పెరగని లాభా లు.. వంటి దృశ్యాలు సాంకేతిక రంగం(Technical Sector)లో చోటుచేసుకుంటున్న కీలక మార్పును కండ్ల కు కడుతున్నాయి.
ఐటీ రంగంలోని ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కత్రిమ మేధ(Artificial Intelligence) (ఏఐ) మౌలిక సదుపాయాలపై ఒరాకిల్ భారీగా పెట్టుబడులు పెడుతుండటం, డేటా సెంటర్ల విస్తరణ, ఓపెన్ ఏఐతో సహా భారీ క్లౌడ్ ఒప్పందాలు కుదుర్చుకోవడం, సంస్థ అంతర్గత కార్యకలాపాల్లోనూ ఏఐ వినియోగాన్ని పెంచడం వంటివి ఒకవైపు జరుగుతుండగా, మరోవైపు ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. ఒరాకిల్ ఉద్యోగుల్లో వేల మందికి రెండు రోజుల క్రితం తెల్లవారుజామునే మెయిల్‌కు ‘మీ సేవలు ఇక చాలు’ అంటూ మెసేజ్‌లు వచ్చాయి.
ఇందులో పదిరోజుల్లో పెళ్లి కావాల్సిన ఓ యువకుడు కూడా ఉన్నాడు. ఉద్యోగం పోవడంతో వా రంతా ఆందోళన చెందుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక కుమిలిపోతున్నా రు. సంస్థలు ఏఐ కోసం చేస్తున్న భారీ ఖర్చు లు ఉద్యోగుల బతుకును రోడ్డునపడేలా చేస్తున్నాయని, పునర్వ్యవస్థీకరణ పేరుతో జరుగుతున్న ఈ పరిణామాలు మున్ముందు మరింత దారుణంగా ఉండొచ్చని ఐటీ నిపుణులు అంటున్నారు.
పింక్ స్లిప్ ఫీవర్
2026 మే 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఒరాకిల్ తన ప్రపంచవ్యాప్త ఉద్యో గుల సంఖ్యను సుమారు 21 వేల మేర తగ్గించింది. అంటే దాదాపు 13 శాతం ఉద్యోగాలు తగ్గినట్టే. సుమారు 1.62 లక్షలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 1.41 లక్షలకు చేరింది. పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ఖర్చులు దాదాపు 1.8- నుంచి -1.84 బిలియన్ డాలర్లకు చేరాయి. తమ కార్యకలాపాల్లో ఏఐ సాంకేతికతలను స్వీకరించడం, అమలు చేయడం వల్ల ఇప్పటికే ఉద్యోగుల సంఖ్య తగ్గిందని, భవిష్యత్తులోనూ అలాంటి తగ్గుదల కొనసాగే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది.
ప్రస్తుత నెలలోనూ మరో విడత ఉద్యోగాల కోతలు చోటుచేసుకున్నా యి. అమెరికాలో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సం బంధించిన విభాగాల్లోనే వందలాది ఉద్యోగులు ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. మన దేశంలో గతంలో వేల మంది ఉద్యోగులను ఒరాకిల్ తొలగించింది. తాజాగా మరో 3 వేల ఉద్యోగాలపై కోతల ప్రభావం ఉండొచ్చ న్న అంచనాలు ఉన్నాయి. ఒక్క ఒరాకిల్ లోనే కాదు చాలా ఐటీ దిగ్గజ సంస్థలు ఇదే దారిలో వెళ్తున్నాయి.
మెటా, అమెజాన్, మై క్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కంపెనీల్లో ఉద్యోగుల సం ఖ్యను తగ్గిస్తున్నాయి. 2025-26 కాలం లో ప్రపంచ ఐటీ రంగంలో లక్షా మందికిపైగా ఐటీ ఉద్యోగులు కొలువులు కోల్పోయారు. ఎప్పుడు తమ మెయిల్‌కు ‘ఉద్యోగం ఊస్టిం గ్’ అనే పింక్ స్లిప్ సందేశం వస్తుందోనని టెకీలు భయపడాల్సి వస్తున్నది.
ఏఐ కోసం పెట్టుబడులు పెడుతూ..!
ఉద్యోగాల కోతల వెనుక ఆర్థిక పరమైన లెక్కలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు 21 బిలియన్ డాలర్లుగా ఉన్న ఒరాకిల్ మూలధన వ్యయం.. 2026లో ఏకంగా 55.7 బిలి యన్ డాలర్లకు పెరిగింది. ఇందులో ఎక్కువ భాగం ఏఐ డేటా సెంటర్ల విస్తరణకే వెళ్తున్నది. తదుపరి సంవత్సరానికి ఈ వ్యయం 70---95 బిలియన్ డాలర్లకు చేరవచ్చనే సూచనలు కంపెనీ నుంచి వెలువడ్డాయి.
ఫలితంగా 2026 ఆర్థిక సంవత్సరంలో ఒరాకిల్ సాధారణ నగదు ప్రవాహం (ఫ్రీ క్యాష్ ఫ్లో) సుమారు 23.7 బిలియన్ డాలర్ల మేర ప్రతికూలంగా నమోదైంది. అదే సమయంలో కంపెనీ భవిష్యత్తులో పొందాల్సిన కాంట్రాక్టు ఆదాయానికి సంబంధించిన భారీ బకాయిలను కూడగట్టుకుంది. వీటన్నింటి పరిణామాల నేపథ్యంలో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నదని ఐటీ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఆపరేషన్స్, కస్టమర్ సపోర్ట్, కోడింగ్, పరిపాలనా కార్యకలాపాలు, మధ్యస్థాయి మేనేజ్మెంట్ విభాగాల్లో కోతలు ఎక్కువగా ఉన్నాయి.
ఒరాకిల్‌లో కోతలు ఇలా..!
* 2026 మే 31 నాటికి సుమారు 21 వేల మంది ఉద్యోగాలు ఔట్. సుమారు 1.62 లక్షలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 1.41 లక్షలకు కుదింపు.
* ప్రస్తుత నెలలోనూ మరో విడత ఉద్యోగాల కోత. ఇందులో 40ఏండ్ల వయసు ఉన్నవాళ్లే ఎక్కువ.
* గతంలో భారత్‌లో సుమారు 12 వేల మంది ఉద్యోగుల నుంచి తొలగింపు. తాజాగా మరో 3 వేల మందిపై ప్రభావం పడే అవకాశం.
కారణాలు ఇవే..!
* ఒరాకిల్ వంటి దిగ్గజ కంపెనీలన్నీ ఏఐ సదుపాయాల కోసం భారీగా ఖర్చులు పెడుతున్నాయి. ఇందులో జీపీల వినియోగం, గిగావాట్ల విద్యుత్ సామర్థ్యం అవసరమయ్యే డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటున్నాయి.
* ఏఐ కోసం పెడుతున్న ఖర్చు లెక్కలను సరిచేసుకునేందుకు ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్స్, కస్టమర్ సపోర్ట్, కోడింగ్, పరిపాలనా కార్యకలాపాలు, మధ్యస్థాయి మేనేజ్మెంట్ విభాగాల్లో కోతలు భారీగా ఉంటున్నాయి.
* భారత్‌పైనా ఈ ప్రభావం పెద్ద ఎత్తున కనిపిస్తున్నది. ఒరాకిల్ చేపట్టిన తాజా లేఆఫ్స్‌లో ఇండియన్స్ చాలా మంది ఉన్నారు.