నకిలీ ఎరువుల దందా
కేటుగాళ్లకు కేంద్రంగా ఓఆర్‌ఆర్
ఉప్పుకు రంగు పూసి.. బ్రాండెడ్ బ్యాగుల్లో నింపి
రూ.30 లక్షల నకిలీ ఎరువులు స్వాధీనం
అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) పరిసర ప్రాంతాలను అడ్డాగా చేసుకుని కొందరు నకిలీ ఎరువుల(Fake fertilizers) దందాను సాగిస్తున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసు కుని నాసిరకం పదార్థాలను అసలైన కంపెనీల బస్తాల్లో నింపి మార్కెట్లోకి తరలిస్తున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.
కుంట్లూరులో వ్యవసాయ శాఖ, పోలీసు అధికారులు నిర్వహించిన సంయుక్త దాడుల్లో సుమారు రూ. 30 లక్షల విలువైన నకిలీ పొటాషియమ్, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో రూ. 2 కోట్ల విలువైన నకిలీ ఎరువులు పట్టుబడిన ప్రాంతంలోనే మళ్లీ ఈ తరహా దందా బయటపడటంతో వ్యవసాయ శాఖ పర్యవేక్షణపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పెద్ద అంబర్పేట్లో సాగిన దందా తీరులోనే ప్రస్తుతం కుంట్లూరులోనూ వ్యాపారం సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
సాధారణ ఉప్పుకు ఎరుపు, బూడిద రంగులు కలిపి యంత్రాల్లో మిక్సింగ్ చేసి, గ్రోమోర్, ఐపీఎల్ (మ్యూరేట్ ఆఫ్ పొటా ష్), కోరమాండల్ వంటి ప్రముఖ కంపెనీల పేరుతో ఉన్న నకిలీ బస్తాల్లో నింపి రైతులకు అంటగడుతున్నారు. తాజాగా వచ్చిన సమాచారంతో అధికారులు కుంట్లూరు ఉషోద య కాలనీలోని ప్లాట్ నంబర్ 43 లో ఉన్న ఓ భారీ గోడౌన్ తాళాలు పగలగొట్టి తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో ఐపీఎల్ ఎంవోపీ బస్తాలు 302, తెల్లని పాలిష్ ఉప్పు బస్తాలు 683, నకిలీ డీఏపీ, కాంప్లెక్స్ బస్తాలు 218 తో పాటు అనుమానాస్పద గ్రాన్యూల్స్ బస్తాలను 2,086 (బూడిద రంగు) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కృష్ణ కిశోర్, రవి, మణి నాయక్ అనే వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం.