50 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
భూపాలపల్లి, అక్టోబర్ 5 (విజయక్రాంతి): ఉపాధ్యాయులు, ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి(Sreepal Reddy) అన్నారు. 50 శాతం ఫిట్మెంట్తో నూతన వేతన సవరణ సంఘాన్ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భూపాలపల్లి సింగరేణి కమిటీ హాల్లో జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉపాధ్యాయుల సంఘం జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్లో ఉన్న కరువు భత్యాలు, ఉద్యోగుల బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డులు అందించి మెరుగైన వైద్య సేవలు కల్పించాలని అన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కేజీబీవీ సీఆర్టీల 29 రోజుల సమ్మె వేతనాలు ఇప్పించేందుకు, నమూనా పాఠశాల ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
అనంతరం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రేగూరి సుభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కుసునపు కిరణ్కుమార్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులు ముసుకు తిరుపతిరెడ్డి, లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. సమావేశంలో రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.