కొత్తగూడెంలో ఠాగూర్ సినిమా
- మృతి చెందిన శిశువుకు వైద్యం
యామిని ఆసుపత్రి ఎదుట ఆందోళన..
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 9(విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఠాగూర్ సినిమాను తలపించేలా ప్రైవేటు వైద్యశాల (Private Hospital) యాజమాన్యం నిర్వహించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదు సంవత్సరాల వయసు కలిగిన చిన్నారి మృతి చెందిన వైద్యం చేసి రు 80 వేల బిల్లు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలోని యామిని ఆసుపత్రిలో ఐదు నెలల శిశువు మృతి చెందడం కలకలం రేపింది.
ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన కుటుంబం తమ ఐదు నెలల కుమారుడిని చికిత్స నిమిత్తం మంగళవారం రాత్రి ఆసుపత్రికి చేర్పించారు. చికిత్స పొందుతూ శిశువు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. శిశువు మృతి చెందిన విషయం వెంటనే చెప్పకుండా, ముందుగా రూ.80 వేల బిల్లు చెల్లించాలని ఆసుపత్రి సిబ్బంది ఒత్తిడి చేశారని వారు ఆరోపించారు.
దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బాధితుల బంధువులు మాట్లాడుతూ.. శిశువు పరిస్థితి సీరియస్గా ఉందని తెలిసినప్పటికీ ఎందుకు చికిత్స అందించారని ప్రశ్నించారు. శిశువు ఆరోగ్య పరిస్థితి గురించి స్పష్టంగా వివరించకుండా, మూడు గంటలుగా డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడేందుకు ప్రయత్నించిన సమయంలో కూడా సరైన స్పందన లభించలేదని ఆమె ఆరోపించారు.
శిశువు శరీరం నల్లగా, చల్లగా మారిపోయిందని కుటుంబ సభ్యులు ప్రశ్నించిన తర్వాతే ఆసుపత్రి సిబ్బంది స్పందించారని తెలిపారు. డబ్బులు చెల్లించిన అనంతరం శిశువు మృతి చెందినట్లు చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.
సంఘటనపై సమగ్ర విచారణ జరిపి ఆసుపత్రి యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేసి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
ఆసుపత్రి ముందు ఆందోళన
వైద్యుల నిర్లక్ష్యం వల్లనే శిశు మరణించారని, సంఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రి చేయాలని డిమాండ్ చేస్తూ మృతుని బంధువులు ఆస్పత్రి నందు ఆందోళనకు దిగారు.
చికిత్స చేస్తున్న సమయంలో శిశువుని చూసేందుకు కూడా ఆస్పత్రి యాజమాన్యం అనుమతించలేదని, రూ 80,000 కట్టిన తర్వాతనే శిశువును అప్పగిస్తామని చెప్పడం అనుమానాలకు దారితీస్తుందని వారు ఆరోపించారు. శిశువు శరీరం నల్లబడటంతో ,పాటు చల్లబడిందని వైద్యం వికటించడం వల్లనే మృతి చెందిందని వాళ్ళు ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించాలంటే డిమాండ్ చేశారు.
ఈ విషయమై యామిని ఆసుపత్రి వైద్యులు జీవన్ కుమార్ ని వివరణ కోరగా పేషంటు సీరియస్ కండిషన్ లో ఉన్నప్పుడు తీసుకువచ్చారని, తమ వంతుగా ప్రయత్నం చేశామని, వైద్యం నిర్వహించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదని స్పష్టం చేశారు.