విద్యా సేవలకు తాటి బిక్షమయ్య చిరస్మరణీయం

01-10-2026 | 03:30pm

టేకులపల్లి, (విజయక్రాంతి): గిరిజన మొదటి తరం ఉపాధ్యాయుడు తాటి బిక్షమయ్య 40 ఏళ్లపాటు విద్యారంగానికి అందించిన సేవలు చిరస్మరణీయమని టిపిటిఎఫ్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(Former State General Secretary of TPTF), ఉపాధ్యాయ దర్శిని సంపాదకుడు పి. నాగిరెడ్డి అన్నారు. టిపిటిఎఫ్ ఆళ్లపల్లి, టేకులపల్లి మండల శాఖల ఆధ్వర్యంలో మూడ్‌తండాలోని ఆయన స్వగృహంలో గురువారం సంతాప సభ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు గుగులోత్ హరిలాల్ నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బిక్షమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు సైతం లేని రోజుల్లో విధులకు క్రమం తప్పకుండా హాజరై వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పారని నాగిరెడ్డి తెలిపారు. ఆయన వద్ద చదువుకున్న పలువురు గిరిజన విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. టిపిటిఎఫ్‌లో వివిధ హోదాల్లో పనిచేసి ఉపాధ్యాయుల సంక్షేమం, ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి కృషి చేశారని గుర్తుచేశారు. కుటుంబానికి అందాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా సంఘం తరఫున కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టిపిటిఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు