కౌన్సిల్ ఎన్నికల్లో విజయం మనదే!
తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికల్లో మన ప్యానల్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో మన ప్యానల్(Mana Panel), ప్రోగ్రెసివ్ ప్యానల్(Progressive Panel) బరిలో నిలిచాయి. మన ప్యానల్ నుంచి సీ కళ్యాణ్ ఏకగ్రీవంగా ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఇదే మన ప్యానల్‌కు చెందిన చదలవాడ శ్రీనివాసరావును కోశాధికారి పదవి దక్కింది.
వైస్ ప్రెసిడెంట్లుగా మోహన్ వడ్లపట్ల (మన ప్యానల్), దామోదర ప్రసాద్ (ప్రోగ్రెసివ్ ప్యానెల్) ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా అమ్మిరాజు (మన ప్యానల్), తుమ్మలపల్లి రామ సత్యనారాయణ (మన ప్యానల్) గెలిచారు. ఈసీ సభ్యులుగా ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి ముగ్గురు, మన ప్యానెల్ నుంచి 12 మంది గెలిచారు. ఇందులో పద్మిని, ఏషియన్ సునీల్, మోహన్ గౌడ్, శివలెంక కృష్ణప్రసాద్, దానయ్య, వంశీ నందిపాటి, పల్లి కేశవ రావు, శ్రీనివాసరావు, పుల్లారావు, బాపిరాజు, ఆర్‌కే గౌడ్, నయీం మన ప్యానెల్ వారు కాగా.. మైత్రి రవి, నిరంజన్‌రెడ్డి, డీఎస్ రావు ప్రోగ్రెసివ్ ప్యానల్ అభ్యర్థులు.
సెక్రటరీ ఎవరో తెలిసేది రేపే..
సెక్రటరీ సంబంధిత కేసు కోర్టులో ఉండటంతో ప్రస్తుతం ఆ పోస్టు ఎన్నికల ఫలితాలను ఒక సీల్డ్ కవర్‌లో ఎన్నికల అధికారి దుర్గాప్రసాద్ సీల్ చేసి కోర్టులో అప్పగించనున్నారు. 8వ తేదీన కోర్టులో జడ్జి సమక్షంలో సెక్రటరీ ఎన్నికల ఫలితాన్ని వెల్లడించనున్నారు.
నిర్మాతల కోసం పనిచేస్తాం: సీ కల్యాణ్
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాల అనంతరం అధ్యక్షుడిగా గెలిచిన సీ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. “95% మెజారిటీతో మన ప్యానెల్ సభ్యులను గెలిపించినందు సభ్యులకు థాంక్స్. మేము నిర్మాతల మంచి కోసం పనిచేస్తాం. మాకు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అతి త్వరలోనే మా కార్యాచరణను వెల్లడిస్తాం.
చిన్న నిర్మాతలకు అన్ని విధాలుగా సాయంగా నిలబడతాం” అన్నారు. కోశాధికారి చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. “మా ప్యానెల్‌లో అనుభవజ్ఞులున్నారు. వారి అనుభవాన్ని ఉపయోగించుకుని సినీ పరిశ్రమను మరింత ఉన్నత స్థాయికి చేరేందుకు కృషి చేస్తాం” అని తెలిపారు. ‘పరిశ్రమకు మంచి చేసేవారు గెలిచారు. నిర్మాతల మండలి ఎన్నికల్లో బలమైన వ్యక్తులు గెలవడం గొప్ప విషయం’ అని తుమ్మల ప్రసన్నకుమార్ అన్నారు.






