సీఈసీ అభిశంసించాలి
- కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను అరెస్ట్ చేయాలి
- సర్ ప్రక్రియను ఉపసంహరించుకోవాలి
- ప్రతిపక్ష పార్టీలు డిమాండ్
- ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేస్తోంది
- విపక్ష పార్టీల ఆరోపణలను ఖండించిన బీజేపీ
- చర్చల ప్రక్రియలో భిన్నాభిప్రాయాలు సహజమే..
- తమ ఉత్తర్వులన్నీ కమిషన్ ఏకగ్రీవ నిర్ణయాలే..:సీఈసీ జ్ఞానేష్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన సర్(ఎస్‌ఐఆర్) ప్రక్రియ(SIR process)పై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు(Election Commissioners) లేవనెత్తిన అభ్యంతరాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. సర్ నిర్ణయాలను ఈసీలో ఏకపక్షంగా తీసుకుంటూ జాతీయ మీడియాలో(National media) వచ్చిన కథనాలపై బుధవారం ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఎస్‌ఐఆర్ (సర్) ప్రక్రియను రద్దు చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. సీఈసీ జ్ఞానేష్ కుమార్(Gyanesh Kumar) ఎన్నికల సంఘాన్ని ‘ఏకపక్ష నిరంకుశత్వం’తో నడుపుతున్నారని ఆరోపించాయి.
ఆయనను అభిశంసిం చి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. కాంగ్రెస్, సీపీఐ(ఎం), తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, డీఎంకే, ఆప్ నాయకులు సీఈసీని తొలగిం చాలని పిలుపునిచ్చారు. అయితే, అధికార బీజేపీ, అధికారిక చర్చలలో ఎన్నికల కమిషనర్లు భిన్నమైన అభిప్రాయాలను పంచుకోవడంతో ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తోందని స్పష్టం చేసింది. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను ఖండించింది.
సర్ ప్రక్రియ కింద పేర్ల తొలగింపుకు సంబంధించిన సమస్యలను కమిషన్‌లోని ముగ్గురు సభ్యులలో ఇద్దరైన ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత కొన్ని నెలల్లో 14 సార్లు ఎత్తిచూపారు. సీఈసీ నిర్ణయ ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై సీఐసీ స్పందిస్తూ, ఎన్నికల సంఘం, ఏ సంస్థలోనైనా చర్చల ప్రక్రియలో భిన్నమైన అభిప్రాయాలు, పరిశీలనలు సాధారణమేనని, తమ ఉత్తర్వులన్నీ ‘గత ఏడాది కాలంలో పూర్తి కమిషన్ తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాల ఫలితమే’ అని స్పష్టం చేశారు.
ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (సర్) విషయంలో ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్ష పార్టీలు, ఈ అంశాన్ని అవకాశంగా తీసుకుని పార్లమెంటులో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) కుమార్‌పై తక్షణమే అభిశంసన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. సర్ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగించారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎన్నికల సంఘాన్ని దేశద్రోహ చర్యగా, భారత ప్రజలకు వ్యతిరేకంగా చేసిన నేరంగా అభివర్ణిస్తూ, తన ‘ఓటు దొంగ’ ఆరోపణను పునరుద్ఘాటించారు.
సీఈసీ కుమార్ తొలగింపునకు సంబంధించి 73 మంది ప్రతిపక్ష రాజ్యసభ ఎంపీలు 2026 ఏప్రిల్ 24న సెక్రటరీ జనరల్‌కు కొత్త తీర్మాన నోటీసును సమర్పించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను జైలుకు పంపాలని, ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి సీఈసీపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని టీఎంసీ (మమతా వర్గం) ఎంపీ డెరెక్ ఓబ్రియన్ అన్నారు.
న్యూఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. అధికారిక చర్చల సమయంలో ఎన్నికల కమిషనర్లు భిన్నమైన అభిప్రాయాలను పంచుకున్నారన్న మీడియా కథనాలు నిజమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనమని అన్నారు.
అయితే, కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ విభాగం ఇన్‌చార్జ్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ మాట్లాడుతూ.. సీఈసీ కుమార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ‘అనుకూల సాధనంగా వ్యవహరించారని ఆరోపించారు. ఓటు అనేది ప్రతిపౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు. దీన్ని దుర్వినియోగం చేయడం తీవ్ర ఆక్షేపణీయమని ఇందుకు ఈసీ కమిషనర్‌పై వేటేయాలని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు.
ఎన్నికలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం సరిదిద్దే చర్యలు తీసుకోవాలని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సూచించారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేయని కాలంలో ఏర్పడిన ప్రభుత్వాలు ‘రాజ్యాంగ విరుద్ధం. ఇది ప్రజాస్వామ్యాన్ని తొక్కేయడమే’ అని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. జ్ఞానేష్ కుమార్ పదవిలో కొనసాగే హక్కు లేదనే విషయంలో ఎలాంటి సందేహం లేదని, ఆయన రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ డిమాండ్ చేశారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని సీపీఐ(ఎం) కూడా డిమాండ్ చేసింది. ఇది ఇకపై ఎన్నికల సంఘం కాదని, సీఈసీ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘ఏకపక్ష నిరంకుశత్వం’ అని సీపీఐ(ఎం) పేర్కొంది. సీఈసీ కుమార్‌ను తొలగించి, ఎన్నికల సంఘం పనితీరుపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని టీఎంసీ కోరింది.