ప్రేమను తిరస్కరించిన ఆమె పరిస్థితి ఏంటి?

25-09-2026 | 05:00am

ప్రతి కథ కూడా సులభంగా అందరికీ అర్థమయ్యేలా ఉండదు. కొన్ని కథలు మనల్ని అసౌకర్యానికి గురిచేస్తాయి.. మనం సహ జంగా అంగీకరించే విషయాలను కూడా ఆ కథలు ప్రశ్నించేలా చేస్తాయి.. చూడకూడదనుకునే నిజాలను ఎదుర్కొనేలా మనల్ని సిద్ధం చేస్తాయి. అలాంటి కథే ‘పూజ మేరీ జాన్’. మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), హ్యూమ ఖురేషి(Huma Qureshi) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు నవ్‌జిత్ గులాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని దినేశ్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. మ్యాడాక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీ నుంచి హిందీ జీ5లో ప్రీమియర్ కానుంది.

బలమైన ఇన్టెన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం.. పూజా చుట్టూ చోటుచేసుకునే కలవరపరిచే ఘటనల నేపథ్యంలో సాగుతుంది. తిరస్కరణ, వ్యామోహం, నిజాన్ని అంగీకరించటం, అసలు ఏం జరిగిందనే నిజం వంటి అంశాలపై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుందీ చిత్రం. పూజకు సన్నిహితుడైన ఓ స్నేహితుడు ఆమెపై తన ప్రేమను వ్యక్తం చేయగా ఆమె తిరస్కరిస్తుంది.

ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలు కలవరపరుస్తాయి. కథ ముందుకు సాగేకొద్దీ అసలు ఏం జరిగింది? దీనికి బాధ్యులు ఎవరు? పూజా పరిస్థితుల కారణంగా బాధితురాలిగా మారిందా? లేక ఆమె చుట్టూ చోటుచేసుకున్న ఘటనలతో ఆమెకు ఏదైనా సంబంధం ఉందా? అనే ప్రశ్నలు మనసులో మెదులుతాయి.

పూజా చుట్టూ జరిగిన పరిణామాల వెనుక అసలు నిజమేంటో తెలుసుకునే ప్రయత్నంలో ఈ కేసులోకి అడుగుపెట్టే న్యాయవాది సనా పరస్పర విరుద్ధమైన వాదనల వెనుక దాగి ఉన్న నిజాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తుంటుంది. అసలు నిజం అంతుచిక్కని పరిస్థి తుల్లో ఈ చిత్రం ప్రేక్షకులను కూడా ఆలోచింప జేస్తుంది. అమాయకత్వం ఎక్కడ ముగుస్తుంది? బాధ్యత ఎక్కడ మొదలవుతుంది? అనే ప్రశ్నలతో పాటు.. తిరస్కరణ, వ్యామోహం, ఓ విషయంపై సమాజం ఎలా ఆలోచిస్తుం దనే విషయాల వెనుక దాగి ఉన్న చీకటి కోణాలను క్రమంగా ఈ కథ ఆవిష్కరిస్తుంది. 


మరిన్ని వార్తలు