అన్నదాతల అవస్థలు
తెలంగాణ(Telangana)లో వాతావరణ ప్రభావం(Weather impact) తీవ్రంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా ఎల్ నినో(El Nino) ఉగ్ర రూపం దాల్చడంతో వ్యవసాయ రంగం(Agricultural Sector) కుదేలవుతున్నది. చినుకు జాడ కానరాకపోవడంతో పంటల(Crops)ను కాపాడుకోవడం రైతులకు(Farmers) సవాల్‌గా మారింది. సాగునీరు అందక అన్నదాతలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. కాగా, వాతావరణ ప్రభావం కనిపిస్తున్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా 1.23 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఈ వానాకాలంలో అత్యధికంగా 54 లక్షల ఎకరాల్లో వరి సాగు(Paddy cultivation) కాగా, గత సీజన్ కంటే ఎక్కువగా 48 లక్షల ఎకరాల్లో పత్తి సాగైనట్టు ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉన్నది. ఈ సమయంలో వరికి పుష్కలంగా నీరు అవసరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ, జలా శయాలు, చెరువులు అడుగంటడంతో రైతులు బోర్లు, బావులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ ఒక్క సారిగా పెరిగింది.
ఒకవైపు విద్యుత్తు ఉత్పత్తి పడిపోతుండగా, మరోవైపు గృహాలు, పరిశ్రమలతో పాటు వ్యవసాయ మోటార్ల విద్యుత్తు వినియోగం పెరుగుతున్నది. తత్ఫలితంగా పెరిగిన అవసరాలకు అనుగుణంగా సరఫరా చేయడం కష్టంగా మారడంతో రైతన్నలకు విద్యుత్తు కష్టాలు చుట్టు ముట్టాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సాగునీటితో పాటు తాగునీటి కొర త కూడా ఏర్పడటం ఆందోళన కలిగిస్తున్నది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రజలు గొంతు తడుపుకొనేందుకు తండ్లాడాల్సిన దుస్థితి దాపురిం చింది.
ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని తెలుస్తున్నది. ఒక్క రంగానికే పరిమితం కాకుండా వ్యవసాయం, విద్యుత్తు, తాగునీటిపైనా వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపుతుండటం కలవరపెడుతున్నది. వాతావరణ మార్పుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతానికి తెలంగాణలోని గ్రామీణ ప్రాంతానికే పరిమితమైన ఈ కష్టాలు రాబోయే రోజుల్లో నగరాలు, పట్టణాలను తాకే ఆస్కారం లేకపోలేదు.
సాగునీరందక పంటలు ఎండిపోతే ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో చేతికొచ్చిన పంటలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత తరుణంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటినుంచే స్పష్టమైన కార్యాచరణ రూపొందించి, పకడ్బందీగా అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది.