ఇదే నా సవాల్!
- వెయ్యి కోట్లు ఇస్తే ఎక్కడంటే అక్కడ సంతకం పెడ్తా
- మిగిలిన రూ. 99 వేల కోట్లు పేదలకు పంచండి
- బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేయడమే కాంగ్రెస్ లక్ష్యం
- కేసులకు భయపడేది లేదు
- కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తూనే ఉంటాం
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): కేసీఆర్ కుటుంబం రూ. లక్ష కోట్లు సంపాదించిందని రేవంత్‌రెడ్డి(Revanth Reddy) చెబుతున్నారని, ఆయన మాటలే నిజమయితే తమ ఆస్తులన్నీ తీసుకుని రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలని.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పష్టం చేశా రు. మిగిలిన రూ. 99 వేల కోట్లను పేదల బ్యాంకు ఖాతాల్లో వేయాలని సవాల్ విసిరారు. ఎన్నికల మేనిఫెస్టో(Election Manifesto), ప్రజలకు ఇచ్చి న హామీల అమలుపై దృష్టి పెట్టకుండా బీఆర్‌ఎస్ నాయకత్వాన్ని, పార్టీ నేతలను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేయడమే కాంగ్రెస్ లక్ష్యంగా మారిందని ఆరోపించారు.
ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారం నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు(Nampally ACB Special Court)లో విచారణకు హాజరైన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం రూ.లక్ష కోట్లు కొల్లగొట్టిందంటూ సీఎం రేవంత్ చేస్తున్న ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, హైదరాబాద్‌ను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేయడం కోసం గతంలో తాము ప్రయత్నించామని పేర్కొన్నారు. అయితే తమపై కేసులు పెట్టి రాజకీయంగా వేధిస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం తన మేనిఫెస్టో అమలుపై సమాధానం చెప్పాల్సిన సమయంలో బీఆర్‌ఎస్ నేతలపై కేసులు, ఆరోపణలతో రాజకీయాలను పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. కేసీఆర్ భూముల విషయంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి గతంలో చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ.. హైదరాబాద్‌కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో అప్పట్లో ఎకరాకు రూ.5 లక్షల చొప్పున కేసీఆర్ భూములు కొనుగోలు చేశారని తెలిపారు. అయితే కేసీఆర్ వెయ్యి ఎకరాలు దోచుకున్నారంటూ గతంలో ప్రచారం చేశారని, ఇప్పుడు అసెంబ్లీలో 67 ఎకరాలే ఉన్నాయని చెప్పారని, మరి ఈ తప్పుడు ప్రచారం ఎందుకు? అని ప్రశ్నించారు.
ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు సృష్టించినా బీఆర్‌ఎస్ నాయకత్వాన్ని ఏమీ చేయలేరని స్పష్టంచేశారు. ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడేది లేదని, ప్రజా సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్‌ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు.
హామీలపై పక్కదారి పట్టించేందుకే..
కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు విషయంలో, 22 ఏ భూముల అంశంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ ఆరోపణల్లో విషం తప్ప విషయం లేదన్నారు. ఒక్కటంటే ఒక్క శాతం నిజం లేదని తెలిసినా ఎందుకీ కుప్పిగంతులు? అని ప్రశ్నించారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందంటూ ఇలాగే దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. అందులో ఒక్క పైసా అవినీతిని కూడా నిరూపించలేకపోయారని అన్నారు.
ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి లక్ష కోట్ల భూములంటూ మరోసారి ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు వాటిని నమ్ముతారని భావించడం సరికాదన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి, నాలుగు కోట్ల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ జీవితం తెరిచిన పుస్తకమని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు కరెంట్ కోతలు, యూరియా సంక్షోభం, సాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షంపై బురదజల్లడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
నిరుద్యోగులకు తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, వెయ్యి రోజులు గడిచినా పది శాతం ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని కేటీఆర్ అన్నారు. తన పాలనా వైఫల్యాలను ఇలాంటి ప్రచారంతో కప్పిపుచ్చలేరన్నారు. పవిత్రమైన అసెంబ్లీలో అసత్యాలు, అభూతకల్పనలతో మాట్లాడి చట్టసభ గౌరవానికి భంగం కలిగించారని కేటీఆర్ ఆరోపించారు. ఇది క్షమించరాని విషయమని పేర్కొన్నారు. 22 ఏ కింద కోటి 20 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చడం వెనుకే సీఎం చెబుతున్న లక్ష కోట్ల భూముల కుంభకోణం దాగి ఉందని కేటీఆర్ ఆరోపించారు.
అక్రమ దందాలు, బ్లాక్‌మెయిల్ రాజకీయాలతో అడ్డదారిలో అధికారంలోకి వచ్చారని రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేశారు. దోచుకోవడం, కుంభకోణాలు చేయడం తప్ప పరిపాలన చేతకాదని ప్రజలకు అర్థమైందని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తిరిగి ఏర్పడగానే కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, కుంభకోణాలన్నింటినీ బయటపెడతామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల సాక్షిగా దోచుకున్న ప్రతి పైసాను కక్కిస్తామని అన్నారు.