పోలీసు వాహనానికి ఘోర ప్రమాదం.. ఎస్సై పరిస్థితి?

24-09-2026 | 08:30am

లారీ ఢీకొని పోలీస్ వాహనం ధ్వంసం.. ఎస్సై, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు..

తిరుమలాయపాలెం, విజయక్రాంతి: తిరుమలాయపాలెం మండల ఎస్సై(Thirumalayapalem Mandal Sub-Inspector) కూచిపూడి జగదీష్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వినాయక నిమజ్జన విధులు ముగించుకుని పిండిప్రోలు నుంచి తిరుమలాయపాలెం పోలీస్‌స్టేషన్‌కు తిరిగి వస్తుండగా గురువారం అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో భవాని హోటల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ఎస్సై జగదీష్, పోలీస్ వాహన డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో పోలీస్ వాహనం తీవ్రంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎస్సై జగదీష్‌తో పాటు కాకరవాయికి చెందిన డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. రాకేష్‌కు తలకు బలమైన గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని స్తంభాద్రి ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సై జగదీష్, డ్రైవర్ రాకేష్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు, లారీ వివరాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు