కవల చిన్నారుల వినాయక భక్తి..
రిమోట్ కారులో విఘ్నేశ్వరుడి నిమజ్జన యాత్ర!
కవల చిన్నారుల భక్తికి రామాయంపేట పట్టణం ఫిదా..
రామాయంపేట, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): చిన్న చేతులతో చేసిన పూజ... మనసంతా నిండిన భక్తి... మూడు రోజులుగా తమ స్వగృహంలో విఘ్నేశ్వరుడిని కొలిచిన ఆ కవల చిన్నారులు చివరకు కన్నీటి వీడ్కోలు పలికారు. వినాయకుడిని నిమజ్జనా(Ganesh Immersion)నికి తరలించిన తీరు చూసి పట్టణవాసుల హృదయాలు కదిలిపోయాయి.
రామాయంపేట పట్టణానికి చెందిన లాల నరేష్ కవల కుమార్తెలు మూడు రోజులపాటు తమ స్వగృహంలో విఘ్నేశ్వరునికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈరోజు సాయంత్రం నిమజ్జనానికి వినాయకుడిని చిన్నారుల మారుతి రిమోట్ కారులో అలంకరించి, భక్తి గీతాల నడుమ నిమజ్జనానికి తరలించారు.
రిమోట్ కారులో కొలువుదీరిన విఘ్నేశ్వరుడు... చుట్టూ మార్మోగిన భక్తి గీతాలు... ఆరాధనగా చూస్తున్న చిన్నారులు... ఈ దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్న వయసులోనే కవల చిన్నారులు చూపిన వినాయక భక్తిని చూసిన పట్టణవాసులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. ఆ చిన్నారుల భక్తిలో ఆర్భాటం లేదు... వారి కళ్లలో కనిపించిన ప్రేమలో మాత్రం ఆ విఘ్నేశ్వరుడే కనిపించాడు. నిమజ్జన వేళ చిన్నారుల ఆప్యాయత, భక్తి పట్టణవాసులను భావోద్వేగానికి గురిచేసింది.