6 September, 2026 | 11:11 AM

బోధన్‌లో నకిలీ సర్టిఫికెట్ల దందా.. ఇద్దరు అరెస్ట్

06-09-2026 | 09:02am

బోధన్, సెప్టెంబర్ 06 (విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని రాకాసిపేట్‌లో నకిలీ ప్రభుత్వ సర్టిఫికెట్లు(Fake Certificates) తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాకాసిపేట్ పెద్ద మసీదు సమీపంలోని సహారా మీ సేవ కేంద్రంలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు CCS పోలీసులు, బోధన్ టౌన్ పోలీసులు(Bodhan Town Police) సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల్లో మీ సేవ ఆపరేటర్ షేక్ వసీమ్, మీ సేవ కేంద్రం యజమాని మహమ్మద్ ముక్రమ్ నకిలీ సర్టిఫికెట్ల తయారీలో భాగస్వాములుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత రెండేళ్లుగా తక్కువ సమయంలో అధికంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ మీ సేవ సర్టిఫికెట్లు తయారు చేసి, వాటిపై సంబంధిత రబ్బర్ స్టాంపులు వేసి ఒరిజినల్ సర్టిఫికెట్ల మాదిరిగా తయారు చేసి ఇస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసి పరస్పరం పంచుకునేవారని పోలీసులు తెలిపారు. నకిలీ సర్టిఫికెట్లను కొందరు ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు మోసపూరితంగా ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.

భారీగా నకిలీ పత్రాలు స్వాధీనం

పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 5 నకిలీ మీ సేవ సర్టిఫికెట్లు, ఇప్పటికే తయారు చేసి ఇచ్చిన 22 నకిలీ జనన ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీలు, తయారీ కోసం ఉంచిన 38 ఖాళీ ఒరిజినల్ మీ సేవ సర్టిఫికెట్లు, ఒక రబ్బర్ స్టాంప్, 13 నకిలీ టీసీలు, బోనఫైడ్ సర్టిఫికెట్లు, షాదీ ముబారక్‌కు సంబంధించిన ఒక నకిలీ జిరాక్స్ కాపీ స్వాధీనం చేసుకున్నారు. అలాగే నకిలీ సర్టిఫికెట్ల తయారీకి ఉపయోగించిన ఒక HP ల్యాప్‌టాప్, ఒక Canon కలర్ ప్రింటర్, ఇద్దరు నిందితుల రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు నిందితుల అరెస్ట్

ఈ కేసులో రాకాసిపేట్‌కు చెందిన మీ సేవ ఆపరేటర్ షేక్ వసీమ్ (32), సహారా మీ సేవ కేంద్రం యజమాని మహమ్మద్ ముక్రమ్ (36)లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై చట్టప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  కేసులో పరారీలో ఉన్న ఇతర నిందితులపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు