జపాన్ పర్యటనకు కర్ని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఎంపిక
మక్తల్, సెప్టెంబర్ 6: అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులు, విద్యా వ్యవస్థ అభివృద్ధికి జపాన్‌లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలపై అవగాహన పెంపొందించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నారాయణపేట జిల్లా(Narayanpet District) మక్తల్ మండలం కర్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్ బి.రూప (SA–Physical Education) జపాన్ పర్యటనకు ఎంపికయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, నిరుపేద విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను పరిచయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పర్యటనను నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 5 నుంచి 12 వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో రాష్ట్రానికి చెందిన 29 మంది ఉపాధ్యాయులు, 11 మంది విద్యాశాఖ అధికారులు పాల్గొననున్నారు.
ఈ పర్యటనలో భాగంగా బి.రూప జపాన్‌లోని విద్యా సంస్థలను సందర్శించి అక్కడి క్రమశిక్షణ, సాంకేతికత వినియోగం, జీవన నైపుణ్యాల బోధన, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, పాఠశాల నిర్వహణ విధానాలు తదితర ఉత్తమ అభ్యసనా పద్ధతులను పరిశీలించనున్నారు. జపాన్‌లోని విద్యా విధానాలను అధ్యయనం చేసి, వాటిలో అనుసరించదగిన అంశాలను తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసేందుకు ఉపయోగపడే అనుభవాన్ని ఆమె పొందనున్నారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా విద్యార్థుల క్రీడా, విద్యా వికాసానికి కృషి చేస్తున్న బి.రూపకు అంతర్జాతీయ స్థాయి పర్యటనకు అవకాశం లభించడం పట్ల జడ్.పి.హెచ్.ఎస్ కర్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె జపాన్ పర్యటన విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల నుంచి జపాన్ వరకు సాగిన బి.రూప ప్రయాణం... కర్ని పాఠశాలకు మాత్రమే కాకుండా నారాయణపేట జిల్లాకే గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.






