ఘోర రోడ్డు ప్రమాదం
రెండు లారీలు ఢీకొని ఇద్దరు మృతి
హుజురాబాద్, సెప్టెంబర్ 30: (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం పరిధిలోని ఎన్‌హెచ్–563 బైపాస్ రోడ్డుపై(NH-563 Bypass Road) మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు బలంగా ఢీకొనడంతో రాజస్థాన్‌కు చెందిన లారీ డ్రైవర్‌తో పాటు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. కేశవపట్నం మండలం ఎన్‌హెచ్–563 బైపాస్ రోడ్డుపై ముందు వెళ్తున్న గ్రానైట్ లారీ (AP 15 TC 7589)ను, వెనుక నుంచి వేగంగా వచ్చిన రాజస్థాన్‌కు చెందిన మరో లారీ (RJ 04 GC 8052) బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజస్థాన్ లారీ డ్రైవర్( Rajasthan Lorry Driver) రావత్ సింగ్, క్లీనర్ ముకేష్ సింగ్ లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో లారీ క్యాబిన్‌లో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి, రహదారిపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అనంతరం మృతుల కుటుంబీకులకు సమాచారం అందించారు. బాధితుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను హుజురాబాద్ మార్చురీకి తరలించి పంచనామా, పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.