జేసీబీ-బైక్ ఢీ: ఇద్దరు యువకులు దుర్మరణం..

02-10-2026 | 10:04am

పాపన్నపేటలోని అయ్యప్ప ఆలయం ముందు చోటుచేసుకున్న ప్రమాదం

ఓ మృతుడికి 10 రోజుల క్రితమే కొడుకు జన్మించాడు 

పాపన్నపేట,అక్టోబర్02: మండల కేంద్రం పాపన్నపేటలోని అయ్యప్ప ఆలయం ఎదురుగా గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేటలోని అయ్యప్ప ఆలయం ఎదురుగా జేసీబీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. బైక్ పై ఇద్దరు యువకులు పాపన్నపేట నుంచి నార్సింగి వైపు వెళ్తుండగా, పాపన్నపేట శివారులోని అయ్యప్ప ఆలయం ముందు ఎదురుగా వస్తున్న జెసిబిని ఢీకొంది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ యువకుడు ఎగిరిపడి జెసిబి బ్యానెట్ పై పడ్డాడు. ఇద్దరు యువకులు టేక్మాల్ మండలం కాదులూరు గ్రామానికి చెందిన మొల్ల దస్తగిరి(25), మడిగారి బాబు(30)గా గుర్తించారు. బాబుకు 10 రోజుల క్రితమే కొడుకు జన్మించాడు. దస్తగిరికి ఇంకా వివాహం కాలేదు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తుక్కయ్య పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడి కానున్నాయి.

మరిన్ని వార్తలు