నాగిరెడ్డిపేటలో విజయవంతంగా ఉల్లాస్ అక్షరాస్యత పరీక్షలు
నాగిరెడ్డిపేట, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(District Collector Ashish Sangwan) ఆదేశాల మేరకు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం నవభారత్ సాక్షరత కార్యక్రమం ఉల్లాస్లో భాగంగా వయోజన అక్షరాస్యత పరీక్షలను నిర్వహించడమైనది. ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం ద్వారా మహిళలను అక్షరాస్యులుగా మార్చేందుకు మలి విడత పరీక్షలను నిర్వహించారు. నాగిరెడ్డిపేట్ మండలంలోని 26 కేంద్రాల ద్వారా 484 మంది మహిళలు ఉత్సాహంగా ఈ పరీక్షల్లో పాల్గొన్నారు.
నిరక్షరాస్యతను నిర్మూలించి ప్రతి ఒక్కరినీ విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నాగిరెడ్డిపేట్ మండల ఇంచార్జ్ ఐకెపి ఎపిఎం కొమ్మ దత్తు తెలిపారు.అక్షరాస్యత సాధించడం ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందడంతో పాటు, కుటుంబం, సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీసీలు, విద్యాశాఖ సిబ్బంది, గ్రామ సమాఖ్య ప్రతినిధులు, పరీక్ష నిర్వాహకులు, వివోఏలు పాల్గొన్నారు.