మార్కెట్ కూల్చొద్దు.. ప్రత్యామ్నాయం చూపించండి

11-09-2026 | 12:17am

- పాతూర్ రైతుల డిమాండ్‌కు వంటేరు ప్రతాప్‌రెడ్డి మద్దతు

గజ్వేల్: రాజీవ్ రహదారి పాతూర్‌లోని కూరగాయల మార్కెట్‌(Vegetable market)ను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కూల్చివేయొద్దని రైతులు డిమాండ్ చేశారు. మార్కెట్‌ను తొలగిస్తే సుమారు 300 రైతు కుటుంబాలు ఉపాధి కోల్పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనకు బీఆర్‌ఎస్‌(BRS) నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి మద్దతు తెలిపారు. వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో రాజీవ్ రహదారిపై కూరగాయలు విక్రయిస్తూ పలువురు రైతులు(Farmers) ప్రమాదాల్లో మృతిచెందారని, రైతుల శ్రేయస్సును కోరి కేసీఆర్ ఆదేశాలతో హరీశ్‌రావు(Harish Rao) రూ.1.50 కోట్లతో పాతూర్ మార్కెట్‌ను నిర్మించారని తెలిపారు.

మల్లన్నసాగర్‌ నుంచి హైదరాబాద్‌కు మంచినీటి పైప్‌లైన్‌ పనుల కోసం మార్కెట్‌ను కూల్చకుండా ప్రత్యామ్నాయ మార్గం చూడాలన్నారు. సమాచారం ఇవ్వకుండా మార్కెట్‌ను కూల్చితే 500 మంది రైతులతో రాజీవ్ రహదారిపై ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ బాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు నర్సింగరావు, లక్ష్మాపూర్ గ్రామ సర్పంచ్ స్వామి, పాతూర్ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మల్లేశం, పాతూర్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు