మెడికల్ కాలేజీకి దర్శనం వెంకటమ్మ మృతదేహం
మహబూబాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): భావి మెడికల్ విద్యార్థులకు పరీక్షల కోసం తమ తల్లి మృతదేహాన్ని మానుకోట మెడికల్ కాలేజీకి (Manukottai Medical College) అందజేసి ఆదర్శంగా నిలిచింది ‘దర్శనం’ కుటుంబం. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దర్శనం వెంకటమ్మ (76) శనివారం మృతి చెందారు. ఆమె కుమారుడు న్యాయవాది దర్శనం రామకృష్ణ, తమ్ముడు ఏఆర్ కానిస్టేబుల్ నాగార్జునలతో పాటు ఐదుగురు అక్కాచెల్లెళ్ల సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ ప్రోత్సాహంతో తమ తల్లి వెంకటమ్మ పార్థివదేహాన్ని మెడికల్ కాలేజీకి అందించేందుకు ముందుకు వచ్చారు. హైదరాబాద్ ఆస్పత్రిలో మరణించిన వెంకటమ్మ మృతదేహాన్ని వారి నివాసానికి తరలించారు.
మాజీ ఎంపీ మాలోతు కవితతో పాటు పలువురు ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు, న్యాయవాదులు, ప్రజా, కుల సంఘాల నాయకులు, జర్నలిస్టులు, బంధువులు తరలివచ్చి వెంకటమ్మ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం వెంకటమ్మ మృతదేహాన్ని ఊరేగింపుగా మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ రెడ్డి, అటానమీ హెచ్ఓడీ డాక్టర్ భరత్ కుమార్ లకు మృతదేహాన్ని అప్పగించారు.