రోడ్డున్నా.. బస్సు రాదు!

25-09-2026 | 05:35am

బస్సు సౌకర్యం లేని గ్రామాలు 

‘మహాలక్ష్మి’ ప్రయోజనం సున్నా 

మహబూబాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): సరైన రోడ్డు సౌకర్యం లేని సమయంలో అనేక ఎండ్ల క్రితం ఆర్టీసీ బస్సులు(RTC buses) నడపగా, మెరుగైన రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సులు నడపకపోవడంతో మహబూబాబాద్ జిల్లాలో అనేక గ్రామాల ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు 30 సంవత్సరాల క్రితం సరైన రోడ్డు సౌకర్యం లేని సమయంలో మహబూబాబాద్(Mahabubabad)లో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయకముందే అనేక గ్రామాలకు అటు ఖమ్మం, నర్సంపేట, వరంగల్ 1, వరంగల్ 2 డిపోల నుండి ఆర్టీసీ బస్సులు నడిచేవి.

తర్వాత మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయడంతో పాటు తొర్రూర్ లో కూడా ఏర్పాటు చేశారు. దీనితో మరిన్ని గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుందని సంతోషించారు. అయితే కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్న చందంగా కొత్తగా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం అటేరుగు.. గతంలో ఆర్టీసీ సౌకర్యం ఉన్న గ్రామాలకు బస్సుల రాకపోకలు నిలిపివేశారు.

ఉదాహరణకు కేసముద్రం మండలం రంగాపురం, బేరువాడ, గూడూరు మండలం రాజనపల్లి, ఇనుగుర్తి మండలం కోమటిపల్లి, నెల్లికుదురు మండలం రాజుల కొత్తపల్లి, చిన్న ముప్పారం తదితర గ్రామాలకు గతంలో ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేది. ఇప్పుడు ఆ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని నిలిపివేశారు. గూడూరు మండలం రాజనపల్లి గ్రామానికి మహబూబాబాద్ డిపో నుండి ఆర్టీసీ బస్సు నడిపిన సమయంలో అత్యధిక ఆదాయం వచ్చేది.

ఆదాయం ఉన్న సమయంలో రోడ్డు సరిగా లేదనే సాకుతో బస్సు సర్వీసు నిలిపివేశారని, ఇంకొన్ని గ్రామాలకు ఆదాయం లేదని బస్సు సర్వీసులు నిలిపివేశారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు గ్రామాల నుండి ప్రధాన రహదారి వరకు, మండల కేంద్రాలకు ఆటోల్లో వచ్చి అక్కడ నుండి జిల్లా కేంద్రానికి, ఇతర ప్రాంతాలకు బస్సుల ద్వారా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.

ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ మేరకు ప్రతి గ్రామాన్ని కనెక్టివిటీ చేస్తూ ఆర్టీసీ బస్సులు నడపాలని కోరుతున్నారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు నిర్వహించి, రవాణా సౌకర్యానికి ఆటంకం లేకుండా ఆర్టీసీ బస్సులు నడపాలని కోరుతున్నారు. ఫలితంగా ప్రభుత్వం మహిళలకు అమలుచేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మారుమూల ప్రాంతాల నుండి ఉచితంగా ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉపయోగపడు తుందని చెబుతున్నారు.

దక్కని మహాలక్ష్మి ఉచిత ప్రయాణం

మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పించింది. మా గ్రామానికి ఆర్టీసీ బస్సు నడపకపోవడం వల్ల గూడూరు మండల కేంద్రానికి, ఇతర అవసరాలకు కేసముద్రం మండలానికి వెళ్లాలంటే ప్రైవేటు వాహనాలు, సొంత ద్విచక్ర వాహనాలను వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనితో మహాలక్ష్మి పథకం వల్ల మాకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. చాలా ఏళ్ల క్రితం వరకు మా ఊరికి ఆర్టిసి బస్సు నడిచేది. మళ్లీ బస్సు సౌకర్యం పునరుద్ధరించాలి. మహిళలు మహాలక్ష్మి పథకం వినియోగించుకుని అభివృద్ధి సాధించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 

-ఇమ్మిరెడ్డి శ్రీలత, వార్డు  సభ్యురాలు, రాజనపల్లి

మరిన్ని వార్తలు