హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
జిల్లా కలెక్టర్ కు ఐఎఫ్టియు వినతి
కొత్తగూడెం,(విజయక్రాంతి): హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ,తెలంగాణ హమాలీ అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు)రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా, గురువారం జిల్లా కలెక్టర్ అంకిత్ కు వినతిపత్రo అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కు సారంగపాణి మాట్లాడుతూ... వ్యవసాయ, కూరగాయల మార్కెట్లు, గోదాములు,రైస్ మిల్లులు,సిమెంటు, ఎరువుల గోదాములు, ట్రాన్స్పోర్ట్ తదితర రంగాలలో హమాలీలు నిత్యం బరువులు మోస్తూ సేవలందిస్తున్నప్పటికీ కనీస హక్కులు,ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత,వైద్య సదుపాయం,పెన్షన్, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు ఏమీ లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలని,ఉపాధి భద్రతతో కూడిన సమగ్ర చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. 50సంవత్సరాలు నిండిన హమాలీ కార్మికులకు నెలకు 10వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని,ఈపీఎఫ్,ఈఎస్ఐ, బోనస్, గ్రూప్ ఇన్సూరెన్స్,ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదాలకు నష్టపరిహారం చెల్లించాలని, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం, లేదా జీవన భృతి కల్పించాలని, మహిళా కార్మికులకు ప్రత్యేక రక్షణ,ప్రసూతి సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హామాలీ&మిల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పందిర్లపల్లి వీరన్న,యాసారపు వెంకన్న,సహాయ కార్యదర్శి కొప్పుల శ్రీనివాస్,ఉపాధ్యక్షులు మేకల వినోద్ నాయకులు బి.కిషన్,చేబోతు రవి, మెంతిని నాగేష్,బాల్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు.






