తెల్ల కాగితం.. ఈతరం సినిమా

23-09-2026 | 05:05am

హర్ష్ రోషన్(Harsh Roshan), నక్షత్ర జంటగా నటిస్తున్న చిత్రం ‘తెల్లకాగితం’. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నందు సవిరిగాన అందిస్తున్నారు. రమేశ్ బండ్రెడ్డి దర్శకుడు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్, కోన వెంకట్, హరీశ్ శంకర్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.. ‘తెల్లకాగితం’ అనేది మన మనసుల్లాంటిది. తెల్లకాగితంపై ఏం రాసుకుంటే మన మనసులో అదే ఉంటుంది.

‘తెల్ల కాగితం’ చిత్రాన్ని అందరూ వీక్షించి పెద్ద సక్సెస్‌ను అందిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. హీరో హర్ష్ రోషన్ మాట్లాడుతూ.. ‘తెలిసీ తెలియని ఓ వయసులో చేసే తప్పుల్ని పట్టుకుని ‘తెల్ల కాగితం’ సినిమాని తీశాం. ఆడియెన్‌లో  ఒకడిగా ఈ కథను విన్నా.. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మాట్లాడుతూ.. ‘మీ (ఆడియెన్స్) లైఫ్, మీరు చేసిన తప్పులు, మీరు చెప్పుకోలేనివన్నీ ‘తెల్లకాగితం’లో ఉంటాయి. అందరూ తప్పకుండా చూడండి’ అన్నారు.

హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ.. ‘ఆశ అనే పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. అమాయకత్వంతో కూడిన ఇలాంటి మంచి పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రస్తుత తరం చూడాల్సిన సినిమా ఇది. కుటుంబ సమేతంగా ‘తెల్ల కాగితం’ చిత్రాన్ని చూడండి’ అని తెలిపింది. నటుడు శివాజీ, రైటర్ నందు, టాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కోన వెంకట్, మూవీటీమ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు