నీళ్లెందుకు ఇడుస్తలే?

23-09-2026 | 05:35am
  1. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం
  2. మమ్మల్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
  3. జూరాల నుంచి సాగునీటిని విడుదల చేయాల్సిందే 
  4. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్
  5. జూరాలకు వెళ్తుండగా గొల్లపల్లి వద్ద అరెస్టు

వనపర్తి/జడ్చర్ల, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): రైతులకు అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు(BJP State President Ramchander Rao) అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జూరాల సందర్శనకు బయలుదేరిన ఆయనను జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి వద్ద పోలీసులు అరెస్టు చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. అరెస్టు చేసే క్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్‌హెచ్ 44పై బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడారు.

జూరాల ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ రైతుల(Farmers)కు సాగునీళ్లెందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టు(Almatti Project)ల్లోనూ నీటి నిల్వలు ఉన్నాయని, కృష్ణాపై ఉన్న ప్రాజెక్టుల నుంచి మహబూబ్‌నగర్ జిల్లాకు రావాల్సిన నీటిని రైతుల అవసరాల మేరకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంటలు సాగు చేసిన అనంతరం కొద్దిరోజులు నీటిని విడుదల చేసి తిరిగి నిలిపివేయడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

రైతులు తమకు ఫోన్ చేసి జూరాలకు రావాలని కోరారని, వారిని కలిసేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. రైతులకు మద్దతుగా వెళ్లే రాజకీయ పార్టీలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. జూరాల ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు. రైతులకు ప్రభుత్వం తగిన సహకారం అందించాలని, పంటలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు.

2019 నుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలులో లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొంటూ, ఇప్పటికైనా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని ఉన్న నీరును రైతులకు అందించేందుకు ప్రభుత్వం ఎందుకు అహిష్టత వ్యక్తం చేస్తున్నారు అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. జూరాలలో నీరు ఉన్నది ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. 

జూరాల వద్ద రైతుల ఆందోళన..

సాగునీటి కోసం రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా వెళ్లిన బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆ పార్టీ నాయకులు, రైతులు జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పిలుపు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సూచనల మేరకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి జూరాల ప్రాజెక్టు వద్దకు వెళ్లారు.

ఈ సందర్భంగా ఆయనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై నిరసనగా నర్వ మండల బీజేపీ అధ్యక్షుడు అజిత్ సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయ్రామ్, బీజేవైఎం నాయకుడు మీసాల అశోక్‌గౌడ్, లంకాల బూత్ అధ్యక్షుడు అయ్యప్పస్వామి జూరాల వద్దకు చేరుకున్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని, అన్నదాతల పక్షాన తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు