ఐలమ్మ వర్ధంతి రోజే రజక మహిళపై దాడి!

10-09-2026 | 10:15pm

- న్యాయం కోసం ఫిర్యాదు చేస్తే కక్షసాధింపా? 

- నిందితులను వెంటనే అరెస్టు చేయాలి: కొమ్ము ఉమేష్‌ యాదవ్‌

గజ్వేల్‌: చాకలి ఐలమ్మ వర్ధంతి రోజున సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రజక సామాజిక వర్గానికి చెందిన మహిళపై దాడి జరగడం తీవ్రంగా ఖండించాల్సిన ఘటన అని సిద్దిపేట జిల్లా బీసీ సంఘం(Siddipet District BC Association) అధ్యక్షుడు కొమ్ము ఉమేష్‌ యాదవ్‌ అన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.  గురువారం బాధితురాలు విధులకు హాజరయ్యేందుకు ఆసుపత్రికి వెళ్లగా, సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన శ్రీనివాస్‌ రెడ్డి ఆమెను విధులకు అనుమతించవద్దని చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అనంతరం సుమారు 30 మంది ఆమెపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

గతంలో తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకే తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నట్లు చెప్పారు. బాధితురాలు తనకు ప్రాణహాని ఉందని వీడియో ద్వారా వెల్లడించిన నేపథ్యంలో ఆమెకు తక్షణమే పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, ఆరోపణలు నిజమని తేలితే హత్యాయత్నం సహా వర్తించే చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలను సేకరించి సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు. న్యాయం కోసం కేసు పెట్టిన మహిళపై దాడి చేయడం ఎంతవరకు సమంజసం? రాజకీయ అండదండలు ఉన్నాయనే కారణంతో ఎవరినీ చట్టానికి అతీతులుగా చూడకూడదని ఉమేష్‌ యాదవ్‌ అన్నారు. బాధితురాలికి న్యాయం జరగకపోతే బీసీ, బహుజన సంఘాలను కలుపుకొని సిద్దిపేటలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు