జాతీయ రహదారుల నిర్మాణానికి వేగంగా భూసేకరణ పూర్తి చేయాలి
బోధన్, అక్టోబర్ 16(విజయక్రాంతి) : నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనుల కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియను అత్యంత త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో భూసేకరణ అంశంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
నేషనల్ హైవే పనులకు సంబంధించి ప్రస్తుతం పెండింగ్లో ఉన్న భూసేకరణ సమస్యలు, మార్కెట్ ధరలు, భూములు కోల్పోయిన రైతులకు అందించాల్సిన నష్టపరిహారం చెల్లింపులు మరియు భూమి అప్పగించడంలో ఎదురవుతున్న జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారుల నిర్మాణ పనులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ భూసేకరణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.
భూసేకరణలో ఏవైనా సమస్యలు నెలకొని ఉంటే వాటిని వెంటనే పరిష్కరించి, భూములను జాతీయ రహదారుల సంస్థకు త్వరగా స్వాధీనం చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ సురేష్, నిజామాబాద్, బోధన్ ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, విజయ కుమారిలతో పాటు నేషనల్ హైవే సంస్థ, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.