తెలంగాణ వారసత్వ పరిరక్షణకు కీలక అడుగు
హెరిటేజ్ శాఖ – యోగ ధారణ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం
బోధన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక, సాంస్కృతిక, పురావస్తు వారసత్వ సంపద పరిరక్షణకు ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర హెరిటేజ్ శాఖ, యోగ ధారణ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, పురావస్తు ప్రదేశాలు, సాంస్కృతిక వారసత్వ అంశాలు, ఇతర విలువైన వారసత్వ సంపదను గుర్తించి, వాటి వివరాలను శాస్త్రీయ పద్ధతుల్లో నమోదు చేయనున్నారు. అలాగే ఆధునిక డిజిటల్ సాంకేతికతను వినియోగించి వారసత్వ సంపదను డిజిటల్‌గా డాక్యుమెంటేషన్ చేసి, భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టనున్నారు.
వారసత్వ సంపద పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, ప్రజా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కూడా ఈ MoUలో భాగంగా ఉంటుంది. ప్రభుత్వ మార్గదర్శకత్వం, నిపుణుల సహకారం, ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి సమగ్ర రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యమని యోగ ధారణ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉదయ్ మహరాజ్ తెలిపారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కళా వైభవాన్ని భవిష్యత్ తరాలకు భద్రంగా అందించేందుకు ఈ భాగస్వామ్యం కీలకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.