చైర్మన్గా సూరె రవి బాధ్యతల స్వీకరణ!
బోధన్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): బోధన్ మండలంలోని ఆమ్దుపూర్ వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్గా సూరె రవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సూరె రవి మాట్లాడుతూ ఆమ్దుపూర్ వ్యవసాయ సహకార సంఘాన్ని (Agricultural Cooperative Society) మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. నూతన డైరెక్టర్ల సమన్వయంతో రైతులకు అవసరమైన ఎరువుల సరఫరా (Fertilizer Supply), వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను సమర్థవంతంగా చేపడతామని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంఘం ద్వారా మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా పీసీసీ డెలిగేట్ గంగా శంకర్ మాట్లాడుతూ ఆమ్దుపూర్ సహకార సంఘం గతంలోనూ అభివృద్ధి బాటలో పయనించిందని అన్నారు. గత అధ్యక్షులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. సంఘం అభివృద్ధిలో కార్యదర్శి రాజేశ్వర్తో పాటు సిబ్బంది కృషి అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో నూతన చైర్మన్, డైరెక్టర్లు సంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, బోధన్ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి, జాడి సొసైటీ చైర్మన్ సుందర్ రాజ్, పలువురు సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, ఏరాజుపల్లి, ఆమ్దుపూర్, రాజీవ్ నగర్ తండా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.