గ్రామీణాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తా

19-10-2026 | 09:33pm

విలోచవరంలో మహా చండీయాగంలో పాల్గొన్న కేంద్ర జాయింట్ సెక్రటరీ నరహరి

మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli district) మంథని మండలం విలోచవరం గ్రామంలో గ్రామ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా చండీయాగం(Maha Chandi Yagam)లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి పాల్గొన్నారు. గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం, శ్రీ కోదండ రామాలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కావేటి రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గ్రామానికి చేరుకున్న నరహరికి గ్రామస్తులు, అమ్మవారి దీక్షలు స్వీకరించిన భవానీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన మహా చండీయాగంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవీ నవరాత్రుల(Devi Navarathri Celebrations) సందర్భంగా భవానీ దీక్ష స్వీకరించిన నేపథ్యంలో గ్రామీణ వాతావరణంలో గ్రామస్తులతో కలిసి యాగంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా నరహరి మాట్లాడుతూ, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటల దిగుబడిపై ప్రభావం పడిందని పేర్కొన్నారు. మహా చండీయాగం ద్వారా రానున్న రోజుల్లో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీగా తన పరిధిలో గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో గ్రామీణాభివృద్ధి పరిపూర్ణంగా జరగడానికి తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో నరహరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొండ రవీందర్, శ్రీ కోదండ రామాలయ కమిటీ అధ్యక్షుడు కావేటి రవికుమార్ యాదవ్, పోతారం మాజీ సర్పంచ్ జాగిరి సదానందం, ఆలయ ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు