తెలంగాణ రాబిన్‌హుడ్ పండుగ సాయన్నకు ఘన నివాళి
పెద్దపల్లి, అక్టోబర్ 22 (విజయక్రాంతి): పేద ప్రజల పక్షాన నిలిచి, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప ప్రజా నాయకుడు పండుగ సాయన్న అని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కొనియాడారు. తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న జీవితం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని తెలిపారు.
గురువారం పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిజాం పాలన కాలంలో ప్రజలను దోపిడీ చేస్తున్న దొరలు, దేశ్‌ముఖ్‌లు, సంపన్నులకు వ్యతిరేకంగా పండుగ సాయన్న ధైర్యంగా పోరాడారని తెలిపారు. పేదలకు అండగా నిలిచి, సంపన్నుల వద్ద ఉన్న ఆస్తులను పేదలకు పంచిపెట్టినందున ఆయనకు తెలంగాణ రాబిన్‌హుడ్‌గా (Robin Hood) గుర్తింపు లభించిందన్నారు.
అప్పటి అధికార వ్యవస్థను ప్రశ్నిస్తూ, ఆధిపత్య శక్తులను ఎదిరించి అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా కృషి చేసిన పోరాట యోధుడు పండుగ సాయన్న అని కొనియాడారు. దేశ్‌ముఖ్‌లు, కరణాలు, పటేళ్లు, భూస్వాముల కుట్రల నేపథ్యంలో ఆయన హత్యకు గురైనప్పటికీ, ప్రజల కోసం చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.
పండుగ సాయన్న వీరోచిత పోరాట గాథను జానపద కళాకారులు నేటికీ 12 మెట్ల కిన్నెరపై ఆలపిస్తూ ప్రజలకు చేరవేస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం పోరాడిన మహనీయుల చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎస్సీ డీఓ రవీందర్, జిల్లా సహకార అధికారి మాల, కలెక్టరేట్ పరిపాలన అధికారి బండి ప్రకాష్, వివిధ శాఖల అధికారులు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.