మోడల్ బస్టాండ్ పనులు వేగవంతం చేయాలి: సీతక్క
ములుగు, అక్టోబర్ 22 (విజయక్రాంతి): నూతనంగా నిర్మిస్తున్న మోడల్ బస్టాండ్ పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి సీతక్క ములుగు జిల్లా కేంద్రంలోని మోడల్ బస్టాండ్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఫ్లోరింగ్, భవన నిర్మాణ పనులతో పాటు ఇతర పనుల పురోగతిని పరిశీలించి, ఇప్పటివరకు పూర్తయిన పనులు, మిగిలిన పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు (Transport Facilities) అందించడంలో బస్టాండ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పనుల వేగంతో పాటు నాణ్యతకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ప్రయాణికులు సురక్షితంగా రాకపోకలు సాగించేలా ఫ్లోరింగ్ పనులు చేపట్టాలని సూచించారు. తాగునీరు, మరుగుదొడ్లు, కూర్చునే సదుపాయాలు, విద్యుత్ దీపాలు వంటి మౌలిక సదుపాయాల (Basic Amenities) కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కళ్యాణి, పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.