పేదల కోసం పోరాడిన పండుగ సాయన్న

22-10-2026 | 12:47pm

మహబూబ్‌నగర్ (విజయక్రాంతి): పేద, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన ధీరుడు పండుగ సాయన్న అని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. పండుగ సాయన్న 174వ జయంతి సందర్భంగా గురువారం మహబూబ్‌నగర్‌లోని పద్మావతి కాలనీ గ్రీన్‌బెల్ట్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నిజాం పాలనలో భూస్వాములు, దొరల అరాచకాలకు వ్యతిరేకంగా పండుగ సాయన్న ధైర్యంగా పోరాడారని పేర్కొన్నారు. పేదల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు.

ప్రజల పక్షాన నిలిచి అన్యాయాన్ని ఎదిరించిన పండుగ సాయన్న తెలంగాణ రాబిన్‌హుడ్‌గా (Robin Hood) ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. ఆయన పోరాట పటిమ, సామాజిక స్పృహ, పేదల పట్ల చూపిన ఆదరణ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీఆర్‌ఓ ఏ. నిర్మల, బీసీ సంఘాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు