పాఠశాలల పనులు త్వరగా పూర్తి చేయాలి

10-09-2026 | 04:05am

కలెక్టర్ కోయ శ్రీహర్ష

మంథని, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(District Collector Koya Sriharsha) అధికారులను ఆదేశించారు. బుధవారం మంథని మండలంలోని ఖాన్సాయిపేట, భట్టుపల్లి, వెంకటాపూర్, మల్లారం, ఆరెంద, స్వర్ణపల్లి గ్రామాల్లోని పలు పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, విద్యార్థుల హాజరు, మౌలిక వసతులు, విద్యాబోధన, అభ్యసన స్థాయిపై అధికారులను, ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖాన్సాయిపేట ఎంపీపీఎస్లో కాంపౌండ్వాల్, పెయింటింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని, వెంకటాపూర్ ఎంపీపీఎస్లో మంజూరైన అదనపు తరగతి గది నిర్మాణాన్ని నెల రోజుల్లోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజూ పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

హాజరు తక్కువగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో నిరంతరం సంప్రదించి కారణాలను తెలుసుకోవాలని సూచించారు. వెంకటాపూర్ నుంచి ఆరెంద వరకు ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించే పనులను వెంటనే క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రహదారి విస్తరణ పనులు పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డుపై ఏర్పడిన గుంతలను యుద్ధప్రాతిపదికన పూడ్చి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో ఎంపీడీవో శ్రీజ రెడ్డి, ఎంపీఓ షబ్బీర్ పాషా, ఏఈ పీఆర్ జగదీశ్, సంబంధిత అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు