కాంగ్రెస్ విషప్రచారం
- గెలిస్తే భేష్.. ఓడితే నిందలా?
- ఈసీపై నమ్మకం లేకపోతే ముగ్గురు సీఎంలతో రాజీనామా చేయించాలి
- చొరబాటుదార్ల ఓట్లు తొలగిస్తుంటే ఎందుకింత కడుపుమంట
- బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు ఫైర్
- వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను జయప్రదం చేయాలని పిలుపు
అక్టోబర్ 5 (విజయక్రాంతి): ‘కాంగ్రెస్ గెలిస్తే ఎన్నికల సంఘం(Election Commission) మంచిది.. ఓడిపోతే మాత్రం నిందలు వేయడం ఆ పార్టీ నేతలకు అలవాటుగా మారింది’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు(N. Ramchander Rao) మండిపడ్డారు. దేశంలో జరిగిన ఎన్నికలు చెల్లవనుకుంటే తెలంగాణ, కేరళం, హిమాచల్‌ప్రదేశ్(Telangana, Kerala, Himachal Pradesh) ముఖ్యమంత్రుల చేత రాజీనామా చేయించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు(Mallikarjun Kharge) సవాల్ విసిరారు. ప్రధాని నరేంద్రమోదీని(Prime Minister Narendra Modi) చూసి ఓర్వలేక, నెహ్రూ కుటుంబంలోని వ్యక్తి ప్రధాని కావడం లేదనే అక్కసుతో ఎన్నికల వ్యవస్థపై ఇండియా కూటమి విషప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చొరబాటుదారుల ఓట్లు తొలగిస్తుంటే కాంగ్రెస్‌కు ఎందుకింత కడుపుమంట? అని ప్రశ్నించారు. అక్రమ ఓట్లతో గెలిచే కాంగ్రెస్‌కు.. భవిష్యత్తుపై భయం పట్టుకుందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా యావత్ ప్రపంచం భారత ఎన్నికల సంఘం పని తీరును, ఎన్నికల నిర్వహణ విధానాన్ని ప్రశంసిస్తుంటే.. దేశంలో జరిగిన ఎన్నికలు చెల్లవని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడటం సిగ్గు చేటన్నారు.
గతంలో కాంగ్రెస్ పాలించిన రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో చొరబాటు దారులు ప్రవేశించి ఇక్కడే స్థిరపడ్డారని.. అడ్డదారిలో రేషన్ కార్డులు పొంది, ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం దేశ పౌరుడైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు లభిస్తుందని, కానీ బంగ్లాదేశ్, బర్మా వంటి దేశాల నుంచి అక్రమంగా వచ్చిన వారు అందుకు అర్హులు కారని స్పష్టం చేశారు.
‘సర’ ప్రక్రియలో కోట్లాది మంది అక్రమ చొరబాటుదారుల పేర్లు వెలుగుచూస్తున్నాయని, తెలంగాణలో ఒక్క మహేశ్వరం నియోజకవర్గంలోనే సుమారు 30 వేల మంది రోహింగ్యాలు, అక్రమ ఓటర్లు ఉన్నట్లు తేలిందన్నారు. చొరబాటుదారుల పేర్లను జాబితా నుంచి తొలగిస్తుంటే ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్, ‘ఇండి’ కూటమి నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని రాంచందర్‌రావు విమర్శించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఆరు గ్యారంటీలతో పాటు మిగతా ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతుభరోసా, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు, ఉపాధ్యాయ నియామకాలు, ఉద్యోగుల పదోన్నతులు అటకెక్కాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయకుండా రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.
గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం బాగుపడితే, కాంగ్రెస్ పాలనలో రేవంత్‌రెడ్డి అండ్ బ్రదర్స్ దోచుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారని ఆరోపించారు. కేవలం కమీషన్లు, కాంట్రాక్టులు, ఢిల్లీకి ముడుపులు పంపడంలోనే కాంగ్రెస్ నేతలు మునిగిపోయా రని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో అక్రమ ఆస్తుల పంపకాల కోసం పంచాయితీలు నడుస్తుండగా.. మరో వైపు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు దోపిడీపై పరస్పరం నిందించుకుంటూ నాటకం ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణను కాపాడే సత్తా ఒక్క బీజేపీకే ఉంద ని ప్రజలు బలంగా నమ్ముతున్నారని, అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో హిందువులకు, హిం దూ సాంస్కృతిక విలువలపై తీవ్ర అన్యాయం జరుగుతోందని రాంచందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నికల ప్రచారంలో ‘ముస్లిం ఈజ్ కాంగ్రెస్.. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం‘ అంటూ వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. నేడు హిందూ దేవతలను, భక్తుల విశ్వాసాలను, ఆచారాలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే రేవంత్‌రెడ్డి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి, మల్కాజిగిరి, దిల్‌సుఖ్‌గర్ సంతోషిమాత ఆలయాలపై జరిగిన దాడుల్లో కుట్ర దాగి ఉందన్నారు. దాడులు జరిగినప్పుడల్లా నిందితుడికి మతిస్థిమితం లేదంటూ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం రివాజుగా మారిందన్నారు.
రేపు సేవా జ్యోతి యాత్ర, వికసిత్ భారత్ సంకల్ప సభ
సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఈ నెల 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ‘సేవా జ్యోతి యాత్ర’, ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’ నిర్వహిస్తున్నట్లు రాంచందర్‌రావు వెల్లడించారు. ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వర్చువల్‌గా ఉద్దేశించి మాట్లాడతారని.. దేశాన్ని ‘వికసిత్ భారత్’గా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న అభివృద్ధి, సంక్షే మ పథకాలపై దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని శ్రేణులకు సూచిం చారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరా రు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్. గౌతంరావు, వీరేంద ర్‌గౌడ్, వేముల అశోక్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్, సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శి దశరథ, కర్ణాటక రాష్ట్ర సహ ఇన్‌చార్జి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.