కనీస వసతులు కరువు..?
- ఇబ్రహీంపట్నం మార్కెట్‌కి వస్తున్న కోట్ల రూపాయల ఆదాయం
- అయినా పట్టించుకోని అధికారులు
- నిత్యం కష్టాలు పడుతున్న రైతులు, మహిళలు
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 12 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డు(Ibrahimpatnam Agricultural Market Yard) అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ఈ మార్కెట్కు నిత్యం ఇబ్రహీంపట్నంతో పాటు మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ తదితర మండలాల పరిధిలోని గ్రామాల నుంచి వందలాది మంది రైతులు(Farmers) తమ పండించిన కూరగాయలు(Vegetables), ఇతర వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి వస్తుంటారు. అయితే, ఇక్కడ కనీస వసతులు లేకపోవడంతో నిత్యం తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. వినియోగంలో లేని తాగునీటి నల్లాలు, టాయిలెట్లురైతులు, వ్యాపారుల సౌకర్యార్థం మార్కెట్ ప్రాంగణంలో నిర్మించిన మరుగుదొడ్లు, తాగునీటి నల్లాలు ప్రస్తుతం అలంకారప్రాయంగా మారాయి.
కనీస వసతులు కరువు...
ఎండనక, వాననక కష్టపడి పంట తెచ్చే రైతులకు తాగడానికి గుక్కెడు మంచి నీళ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. నిత్యం బయట ప్రైవేటు వాటర్ బాటిళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మార్కెట్కు కూరగాయల విక్రయం కోసం అధిక సంఖ్యలో మహిళా రైతులు వస్తుంటారు. టాయిలెట్లు మూతపడటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లోనే మలమూత్ర విసర్జన చేయాల్సి వస్తోంది. స్వచ్ఛ భారత్ ప్రచారాలు పక్కనబెట్టి, ఇక్కడ కనీస పరిశుభ్రత పాటించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కోట్ల ఆదాయం వస్తున్నా...
మార్కెట్కు సంబంధించిన పాత, కొత్త మడిగెలు పౌరసరఫరాల శాఖకు అద్దెకిచ్చిన గోదాములు, రైస్ మిల్లులు, నెయ్యి ప్రాసెసింగ్ యూనిట్లు, ఆయిల్ మిల్లులు, మొక్కజొన్న ప్రాసెసింగ్ కేంద్రాలు మరియు మందీ ట్రేడర్స్ ద్వారా ప్రతి ఏటా ప్రజాధనం, ట్యాక్సుల రూపంలో మార్కెట్ కమిటీకి కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. పన్నులు వసూలు చేయడంలో చూపుతున్న శ్రద్ధ.. రైతులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు చూపకపోవడం గమనార్హం.
ప్రభుత్వ ఆదేశాలు బుట్టదాఖలు...
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అగ్రికల్చర్ మార్కెట్లలో అన్ని వసతులు కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఇక్కడి అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రాత్రివేళల్లో సరైన విద్యుత్ దీపాలు లేకపోవడం, షెడ్లు సరిపడా లేక వర్షం వచ్చినప్పుడు సరుకు తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోవడం వంటి అదనపు సమస్యలు కూడా వేధిస్తున్నాయి.
అధికారులు స్పందించాలి
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు మరియు మార్కెట్ యార్డు పాలకవర్గం స్పందించి...మూతపడిన మరుగుదొడ్లను తక్షణమే బాగుచేసి అందుబాటులోకి తీసుకురావాలని,ప్రాంగణంలో ఉచిత మినరల్ వాటర్ ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పించాలని,పరిశుభ్రతను కాపాడేందుకు పారిశుధ్య కార్మికులను నిరంతరం అందుబాటులో ఉంచాలని, మార్కెట్ లో ని సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే మార్కెట్ యార్డు ముట్టడికి మరియు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని స్థానిక రైతులు, వ్యాపార సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.