ఐదంతస్తుల భవనం పక్కన ఇంటర్ విద్యార్థి మృతదేహం
శేరిలింగంపల్లి,అక్టోబర్ 28 (విజయక్రాంతి): మణికొండలో(Manikonda) విషాద ఘటన చోటుచేసుకుంది. స్పెక్ట్రమ్ ఐవీ అపార్ట్‌మెంట్స్‌లో(Spectrum IV Apartments) నివసిస్తున్న ఎం. శ్రీదేవి కుమారుడు, 17 ఏళ్ల గెడ్డం హేమంత్ శ్రీ సాయి అనుమానాస్పద స్థితిలో మృతి(Death) చెందాడు. కోకాపేటలోని ఎక్సెలెన్షియా కళాశాలలో(Excellencia College) ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న హేమంత్ బుధవారం తెల్లవారుజామున సుమారు 5.30 గంటల సమయంలో వారి ఐదంతస్తుల నివాస భవనం పక్కన తీవ్ర తలగాయాలతో పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థి మృతికి గల కారణాలు, భవనం పైనుంచి పడిపోయాడా లేక మరేదైనా కారణమా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతికి దారితీసిన పరిస్థితులు ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.