తీరాన్ని తాకిన అర్నబ్ తుఫాన్

28-10-2026 | 08:21am

ఉప్పాడ తీరంలో అలజడి.. బండరాళ్లను సైతం కొట్టేసిన అలలు!

అమరావతి: అర్నబ్ తుపాను(Cyclone Arnab) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంత జిల్లాలు వణికిపోతున్నాయి. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలగా, రహదారులపై వరదనీరు చేరడంతో Traffic సమస్యలు ఏర్పడ్డాయి.

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తాజా వాతావరణ నివేదికల ప్రకారం విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. అనకాపల్లి జిల్లాలోని కన్నూరిపాలెంలో అత్యధికంగా 261.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం. విజయనగరం జిల్లాలోని కేవీబీఆర్ స్కూల్ పరిసరాల్లో 259.74 మి.మీ., విశాఖపట్నంలోని 16వ పోలీస్ బెటాలియన్ ప్రాంతంలో 259.06 మి.మీ. వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తుండగా, తీరప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. పలు చోట్ల చెట్లు కూలిపోవడం, రోడ్లపై నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం, గురువారం కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఉప్పాడ తీరంలో ఉవ్వెత్తున అలలు

అర్నబ్ తుపాన్ తీరాన్ని తాకింది. తుపాన్ ప్రభావంతో కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ అలలు ఎగసిపడటంతో Beach Road దెబ్బతింది. సముద్రపు అలల ఉద్ధృతి, ఈదురుగాలుల కారణంగా తీరప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. ఉప్పాడ–కాకినాడ మార్గంలో అలల ప్రభావంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అర్నబ్ తుపాను యానం సమీపంలో తీరం దాటే ప్రక్రియలో కొనసాగుతోంది. తుపాను కేంద్రం తీరానికి దగ్గరగా ఉండటంతో భారీ వర్షాలు, బలమైన గాలుల ప్రభావం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గాలుల వేగం గంటకు 135 కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉండగా, గాలుల వేగం ఒక్కోసారి 150 కిలోమీటర్ల వరకు పెరగవచ్చని అంచనా వేసింది. 

తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. వరదనీరు ఉన్న రోడ్లపై ప్రయాణించకూడదని, సముద్ర తీరాలకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. అత్యవసర సహాయం అవసరమైనవారు అధికారులను సంప్రదించాలి. వాతావరణ శాఖ, జిల్లా యంత్రాంగం జారీ చేసే తాజా Alerts‌ను గమనిస్తూ భద్రతా చర్యలు పాటించాలి. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులెవరూ  సముద్రంలోకి వెళ్లొద్దని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజలు ఇంటి వద్దే ఉండాలని సూచించారు. 30,043 పడవలు ఎక్కడికక్కడ ల్యాండ్ అయ్యాయి. వాటిని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. వైద్య సేవల కోసం 1,050 వైద్య బృందాలను పెట్టామన్న సీబీఎన్ 8,370 అత్యవసర పడకలు సిద్ధం చేశామని వివరించారు. అత్యవసర మందులు, పాముకాటు చికిత్సకు కావలసిన యాంటీ స్నేక్ వెనమ్ కూడా అందుబాటులో ఉంచామని వెల్లడించారు.


మరిన్ని వార్తలు