కరెంట్పై కనువిప్పు!
- ‘యాదాద్రి విద్యుత్తు’పై మేల్కొన్న సర్కారు
- ఎల్ నినోను ఎదుర్కోవాలంటే యాదాద్రి ప్లాంట్ నడిపించాలని నిర్ణయం..
- ఐదుగురు ఐఏఎస్లకు పరిశీలన, పర్యవేక్షణ అధికారాలు
- 3200 మెగావాట్లను 80 పీఎల్ఎఫ్తో నడిపిస్తే గరిష్ట లాభం ప్రస్తుతం సగటున 32 శాతం పీఎల్ఎఫ్తోనే విద్యుదుత్పత్తి
- రాష్ట్ర అవసరాల్లో ఆరోవంతు తీర్చే సామర్థ్యం ఉన్న థర్మల్ కేంద్రం
- బొగ్గు సరఫరా, నాణ్యతలోపం, ఇతర సాంకేతిక సమస్యలపై పరిశీలన
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): ఒకవంక ఎల్ నినో ప్రభావం(El Nino Effect).. మరోవంక బొగ్గు కొరత.. ఇంకోవంక ప్రజల్లో విద్యుత్తు సరఫరాపై రోజురోజుకూ పెరుగుతున్న అసంతృప్తి వెరసి రాష్ట్ర సర్కారుకు అసలు విషయం అర్థమైంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) సమీక్షించడంతో లోటుపాట్లు అవగతమయ్యాయి.
ప్రజలకు కావాల్సినంత విద్యుత్ సరఫరా చేయాలంటే యాదాద్రి పవర్ ప్లాంట్ను పరుగులు పెట్టించడం తప్పించి మరో మార్గం లేదని ప్రభుత్వానికి కనువిప్పు కలిగింది. యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం తెలంగాణలో విద్యుత్తు సరఫరాకు అత్యంత కీలకమైనదని గ్రహించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటే.. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ప్రభుత్వం భావించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది.
3200 మెగావాట్లను..
యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మస్తున్నారు. మొత్తం 5 యూనిట్లను ఒక్కొక్కదాన్ని 800 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 4 యూనిట్లు ప్రారంభమయ్యాయి. అంటే రాష్ట్రానికి సొంతంగా 3200 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వచ్చినట్టే. త్వరలో ఐదో యూనిట్కూడా అందుబాటులోకి వస్తుందని తెలంగాణ జెన్కో చెబుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో 19000 మెగావాట్ల వరకు రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ నమోదవుతోంది. ఈ మొత్తాన్ని అందుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తల ప్రాణం తోకకు వస్తోంది. తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో మొత్తం 7180 మెగావాట్లు ఉండగా.. ఒక్క యాదాద్రిలోనే 3200 మెగావాట్లు ఉంది. అంటే రాష్ట్రంలో నమోదయ్యే గరిష్ట డిమాండ్లో కనిష్టంగా సుమారు 18 శాతం యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం నుంచే తీర్చే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలోనే యాదాద్రిని పూర్తిస్థాయిలో విద్యుత్తు ఉత్పత్తికి ఉపయోగించుకోగలిగితే.. ఎల్నినో ప్రభావాన్ని గరిష్టంగా తట్టుకునే అవకాశం చిక్కుతుందని, తద్వారా ప్రజల్లో విద్యుత్తు కోతలపై వెల్లువెత్తుతున్న అసంతృప్తిని తగ్గించే అవకాశం ఉందని సర్కారు చివరికి గ్రహించింది. అందుకే యాదాద్రిని పర్యవేక్షించి, పరిశీలించి, అసలు సమస్యలను కనుగొని, పరిష్కారాలను చూడటానికి వీలుగా ఐదుగురు యువ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక జీవో ద్వారా పురమా యించడం గమనార్హం.
80 శాతం సామర్థ్యంతో..
నిజానికి యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం నడవడానికి అనుకూలమైన జీ9 గ్రేడ్ బొగ్గును సింగరేణి సరఫరా చేయడం లేదని మొదటి నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే జీ 10, జీ 11 గ్రేడ్నుకూడా బ్లెండింగ్ చేయడం ద్వారా యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని సజావుగా నడిపించవచ్చని విద్యుత్తు రంగ నిపుణులు చెబుతున్న నేపథ్యంలో.. ఒకవంక ఒడిశాలోని నైనీ నుంచి జీ 9, జీ 10, జీ 11 గ్రేడ్ బొగ్గును దిగుమతి చేసుకునేందుకు యంత్రాంగం వేగంగా చర్యలు తీసుకుంది.
అలాగే కోల్ ఇండియా, మహానది కోల్ ఫీల్డ్స్ నుంచికూడా సరిపోయినంత బొగ్గును సరఫరా చేసేలా మంతనాలు సాగిస్తున్నారు. వెరని యాదాద్రిని పూర్తిస్థాయిలో నడిపిస్తే సమస్యను వీలైనంత వరకు తగ్గించగలమని సర్కారుకు అర్థమయ్యింది. ప్రస్తుతానికి యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రంలోని నాల్గు యూనిట్లలో 2, 3వ, 4వ యూనిట్లు మాత్రమే నడుస్తున్నాయి. అదికూడా తూతూ మంత్రంగా 24 నుంచి 46 పీఎల్ఎఫ్తోనే నడిపిస్తుండటం గమనార్హం. ఒకటవ యూనిట్ గడిచిన కొద్ది రోజులుగా సాంకేతిక సమస్యల కారణంగా విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేశారు.
అయితే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేయకపోవడానికి ప్రధాన కారణం.. బొగ్గు అని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సరిపోయినంత బొగ్గును తరలించేందుకు, తరలించిన బొగ్గును సక్రమంగా వినియోగించేందుకు, పూర్తిస్థాయి లో విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు వీలుగా తీసుకున్న చర్యల్లో భాగంగానే ఐదుగురు యువ ఐఏఎస్ అధికారులను పురమాయించింది.
ప్రత్యేక సూచనలు..
నాల్గు కోల్ స్ట్రీమ్లు సరిగ్గా పనిచేస్తున్నాయా. చేయకపోతే ఎందుకు. బొగ్గు సరఫరా సామర్థ్యం ఎంత.. ప్రస్తుత పరిస్థితి ఏమిటి? సరఫరా చేస్తున్న బొగ్గు గ్రేడ్ ఏమిటి. విద్యుత్తు ఉత్పత్తికి ఇదెంత వరకు ఉపయోగపడుతుంది. నిర్దేశించిన గ్రేడ్ బొగ్గు సరఫరా అవుతుందా..లేదా? నాల్గు యూనిట్లలో బొగ్గు నిల్వలు సరిపోయినంతగా ఉన్నాయా. లేకపోతే కారణాలేమిటి. కోల్ బంకర్లలో వేయడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా. వీజీఎఫ్లు సరిగ్గా నడుస్తున్నాయా. థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని నిర్మిస్తున్న బీహెచ్ఈఎల్ ఇంకా ఏమేమి పనులు చేయాల్సి ఉంది.
బొగ్గు రేకులు ఎంత సమయంలో నింపుకుంటున్నాయి. ఎంత సమయంలో తిరుగు ప్రయాణం అవుతున్నాయి. వీటి సామర్థాన్ని ఎలా పెంచాలి. ఈ నేపథ్యంలో నాల్గు యూనిట్లు పూర్తిస్థాయిలో థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయా. చేయలేకపోతే కారణాలేమిటి. దీనివల్ల ఎంతమేర విద్యుత్తు జనరేషన్ నష్టం జరుగుతోందని నిర్దేశించిన తేదీల్లో థర్మల్ విద్యుత్తు కేంద్రంలోనే ఉంటూ.. వీటిపై దృష్టి సారించాలంటూ ప్రత్యేకంగా ఆదేశాలివ్వడం ఇక్కడ ప్రస్తావనార్హం.
సగటున 32 శాతం పీఎల్ఎఫ్తోనే..
ఈనెల 14 నాటికి (బుధవారం) పరిస్థితిని చూసుకుంటే.. యూనిట్ 1 ఇప్పటి వరకు (ఏప్రిల్ 1 నుంచి 14 అక్టోబర్, 2026 వరకు) కేవలం 917.54 మిలియన్ యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. అంటే 24.26 శాతం పీఎల్ఎఫ్ అన్నమాట. అలాగే రెండోయూనిట్ 1738.20 మిలియన్ యూనిట్లు (45.95 శాతం పీఎల్ఎఫ్), మూడో యూనిట్ 797.17 మి.యూనిట్లు (26.96 శాతం పీఎల్ఎఫ్), నాల్గోయూనిట్ 1246. 42 మి.యూనిట్లు (32.95 శాతం పీఎల్ఎఫ్)ను ఉత్పత్తి చేయగలిగాయి. వీటన్నింటి సగటు చూసుకుంటే.. 32 శాతం పీఎల్ఎఫ్గానే చెప్పవచ్చు.
ఇదే 80 శాతం పీఎల్ఎఫ్తో నాల్గు యూనిట్లు విద్యుత్తును ఉత్పత్తి చేస్తే.. రాష్ట్ర అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం గ్రహించింది. ఒకవంక కొత్తగూడెం (2x250 మెగావాట్లు) 79.75 శాతం పీఎల్ఎఫ్తో, కాకతీయ 82.26 శాతం పీఎల్ఎఫ్తో విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉంటే.. యాదాద్రి మాత్రం మరీ హీనంగా 30 నుంచి 32 శాతం సగటు పీఎల్ఎఫ్తో పనిచేయడంపై సర్కారు తీవ్ర అసంతృప్తితో ఉంది. కారణాలను కనుగొని వాటిని పరిష్కరించి, పూర్తిస్థాయిలో విద్యుత్తును ఉత్పత్తిచేస్తే.. రాష్ట్ర అవసరాలకు సరిపోయినంత విద్యుత్తులో గరిష్టంగా సొంతంగానే ఉత్పత్తి చేసుకోవచ్చని భావిస్తోంది.