తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

03-10-2026 | 04:33pm

* శేరి దామరగిద్దలో ఘనంగా అన్నప్రాసన, శ్రీమంతం

* గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి: డాక్టర్ జువేరియా బేగం

* ఆరోగ్య పరీక్షలు, చిన్నారుల పోషణపై అవగాహన

నాగల్‌గిద్ద, అక్టోబర్ 3 (విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండలంలోని(Nagalgidda Mandal) శేరి దామరగిద్ద గ్రామంలో మండల సూపర్‌వైజర్ ప్రశాంతి(Mandal Supervisor Prashanthi) ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణపై(Healthcare for Young Children) అవగాహన కల్పిస్తూ అన్నప్రాసన, శ్రీమంతం కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి కరస్‌గుత్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Karasgutti Primary Health Centre) వైద్యాధికారి డాక్టర్ జువేరియా బేగం, సూపర్‌వైజర్ విక్టోరియా రాణి హాజరై గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యపరమైన పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా చిన్నారులకు సంప్రదాయబద్ధంగా అన్నప్రాసన నిర్వహించడంతో పాటు గర్భిణులకు శ్రీమంతం చేశారు. గర్భధారణ సమయంలో మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ జువేరియా బేగం సూచించారు. గర్భిణులు సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవాలని, వైద్య సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.

తల్లికి సరైన పోషకాహారం అందితే గర్భంలోని శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు దోహదపడుతుందని వివరించారు.చిన్నారుల ఎదుగుదలలో తొలి సంవత్సరాలు ఎంతో కీలకమని, వారి వయస్సుకు అనుగుణంగా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు. పిల్లల బరువు, ఎత్తు, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన సమయంలో వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. చిన్నారుల పోషణ విషయంలో తల్లిదండ్రులకు అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు అవగాహన కల్పించాలని సూచించారు.

గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఆరోగ్య, పోషకాహార సేవలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యాధికారి సూచించారు. గర్భిణులకు నిర్ణీత సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించడం, అవసరమైన ఆరోగ్య సలహాలు అందించడం, చిన్నారులకు సకాలంలో టీకాలు అందేలా చూడడంలో వైద్య, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు.

మండల సూపర్‌వైజర్ ప్రశాంతి మాట్లాడుతూ గర్భిణుల ఆరోగ్య పరీక్షలు, బాలింతల సంరక్షణ, చిన్నారుల పోషణ, టీకాలపై అంగన్‌వాడీ టీచర్లు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలన్నారు.కార్యక్రమంలో సూపర్‌వైజర్ విక్టోరియా రాణి, అంగన్‌వాడీ టీచర్లు నిర్మల, జ్యోతి, బసమ్మ, విద్యావతి, సునీత, ఎంఎల్‌హెచ్‌పీలు పూజా పాటిల్, రాజశేఖర్ రెడ్డి, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు