గిరిజన తండాల అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే సంజీవరెడ్డి
రూ.33.50 లక్షల సీసీ రోడ్లు ప్రారంభం.. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
నాగల్గిద్ద, అక్టోబర్ 25 (విజయక్రాంతి): నాగల్ గిద్ద మండలంలోని(Nagal Gidda Mandal) పలు గిరిజన తండాలు, మారుమూల గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి(Dr. Patlolla Sanjeeva Reddy) అన్నారు. ఆదివారం నాగల్గిద్ద మండలంలోని ఇరాక్‌పల్లి, మావినెల్లి గ్రామాల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఇరాక్‌పల్లి మెగా నాయక్ తండా, మావినెల్లి కిషన్ నాయక్ తండాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ(Housewarming for 'Indiramma' homes) వేడుకలకు హాజరై లబ్ధిదారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రిబ్బన్ కట్ చేసి నూతన గృహాలను ప్రారంభించి లబ్ధిదారులకు(Beneficiaries) శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఇరాక్‌పల్లి మెగా నాయక్ తండాలో రూ.8.50 లక్షలు, కిషన్ నాయక్ తండాలో రూ.15 లక్షలు, కారోబరి తండాలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. మొత్తం రూ.33.50 లక్షలతో నిర్మించిన ఈ రోడ్లతో తండాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు. అనంతరం కిషన్ నాయక్ తండాలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజన తండాల్లో రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటామని, నారాయణఖేడ్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విట్టల్‌రావు పాటిల్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంజిరెడ్డి, సర్పంచులు హటిసింగ్, సువాలిబాయి గోవింద్, రాజు, రామావత్ సంతోష్, రవి, అనిల్ పాటిల్, సంతోష్, రతన్‌సింగ్, పంచాయతీ కార్యదర్శులు రాజయ్య, స్వామి, మాజీ ఎంపీటీసీ కిషన్, నాయకులు అంబ్రేష్, సునీల్ పాటిల్, నారాయణ జాదవ్, సురేష్ జాదవ్, కమల్‌సింగ్, ప్రేమ్‌సింగ్, పండరి, ధరసింగ్, గణపతి తదితరులు పాల్గొన్నారు.