కబ్జాపై చర్యలు.. ప్రహరికే పరిమితమా?
- 230 గజాల ఆక్రమణపై నోటీసులు..
- కూల్చివేతలో మాత్రం పాక్షిక చర్యలే
- ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన సంతోష్‌రెడ్డి
సంగారెడ్డి/అమీన్పూర్, అక్టోబర్ 12 : ప్రభుత్వ భూముల పరిరక్షణలో(Protection of Government Lands) అధికారుల చర్యలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. అమీన్పూర్ మండలం(Ameenpur Mandal) కిష్టారెడ్డిపేట రెవెన్యూ(Kishtareddypet Revenue) పరిధిలోని సర్వే నంబర్ 164లో ప్రభుత్వ భూమి ఆక్రమణ(Encroachment of government land) వ్యవహారంలో ప్రహరీ గోడను కూల్చివేసిన అధికారులు, మిగిలిన నిర్మాణాలపై చర్యలు తీసుకోలేదన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 230 గజాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ, కూల్చివేత ప్రహరీ గోడకే పరిమితమైందని ఫిర్యాదుదారుడు సంతోష్రెడ్డి ఆరోపించారు.
నోటీసుల్లో 230 గజాలు.. చర్యల్లో ప్రహరీనేనా?
ఈ వ్యవహారంపై సంతోష్రెడ్డి ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, ఆర్డీవో తహశీల్దార్కు ఫోన్ చేసి వివరాలు అడిగినట్లు తెలిపారు. దీనికి స్పందిస్తూ ప్రహరీ గోడ మాత్రమే కూల్చివేత పరిధిలోకి వస్తుందని తహశీల్దార్ చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే సంబంధిత బిల్డర్కు జారీ చేసిన నోటీసులో 230 గజాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు ప్రస్తావించారని గుర్తుచేశారు. నోటీసుల్లో విస్తీర్ణాన్ని పేర్కొంటూ, ఉన్నతాధికారులకు మాత్రం ప్రహరీ గోడ గురించే వివరించడం ఏమిటని ప్రశ్నించారు.
పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలి..
ప్రభుత్వ భూమి ఆక్రమణపై గతంలో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి, తెలంగాణ భూ ఆక్రమణల నిరోధక చట్టం -1905లోని సెక్షన్ 7 కింద సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయినప్ప టికీ, ఆక్రమణకు గురైన స్థలంలో పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే నంబర్ 164లో ప్రభుత్వ భూమి హద్దులను నిర్ధారించి, ఆక్రమణకు గురైన స్థలాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని సంతోష్రెడ్డి ఉన్నతాధికారులను కోరారు. మిగిలిన నిర్మాణాలపై కూడా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.