సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
సీపీ రష్మీ పెరుమాళ్
సిద్దిపేట క్రైం, అక్టోబర్ 8 (విజయక్రాంతి) : సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్(Police Commissioner Rashmi Perumal) సూచించారు. గురువారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో సైబర్ క్రైం అవేర్‌నెస్ పోస్టర్లను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. “ఆగండి.. ఆలోచించండి.. ధృవీకరించండి” అనే సూత్రాన్ని పాటిస్తే సైబర్ మోసాల నుంచి రక్షణ పొందవచ్చని సూచించారు.
ఓటీపీ, యూపీఐ పిన్, సీవీవీ, బ్యాంకు పాస్‌వర్డ్ వంటి వివరాలను ఇతరులతో పంచుకోవద్దన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టే కాల్స్, నకిలీ వెబ్‌సైట్లు, అధిక డిస్కౌంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే 1930కు ఫోన్ ద్వారా లేదా cybercrime.gov.in వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. సైబర్ మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే డబ్బు రికవరీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సీపీ తెలిపారు.