డిజిటల్ క్రాప్ సర్వే పంట నమోదు తప్పనిసరి
బెజ్జంకి: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే(Digital Crop Survey)లో ప్రతి రైతు తాము సాగు చేసిన పంటను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి జె. స్వరూప రాణి(District Agriculture Officer J.Swaroopa Rani) సూచించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం చీలపూర్ గ్రామంలో క్షేత్రస్థాయిలో డిజిటల్ క్రాప్ సర్వే పంట నమోదు ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ.. రైతులు తమ పొలాల్లో సాగు చేసిన పంట వివరాలను సర్వే నంబర్ వారీగా సంబంధిత గ్రామ వాలంటీర్ వద్ద ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని సూచించారు.
పంట నమోదు చేసుకున్న రైతులు భవిష్యత్తులో తమ పంటను విక్రయించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. పంట వివరాలను నమోదు చేసుకోకపోతే పంట విక్రయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొని నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులందరూ డిజిటల్ క్రాప్ సర్వే పంట నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సంతోష్, ఏఈవోలు మౌనిక, సాయిచరణ్, రైతులు పాల్గొన్నారు.