రక్తసిక్తమవుతున్న రహదారి..!

16-10-2026 | 05:25am
  1. హైదరాబాద్ రామగుండం రహదారిపై వరుస ప్రమాదాలు
  2. ఒక్క ప్రమాదం.. ఎన్నో కుటుంబాలకు తీరని శోకం
  3. ఒకే వారంలో నలుగురు మృతి
  4. బెజ్జంకి నుంచి కోహెడ వరకు ప్రమాదాల ఆందోళన

బెజ్జంకి, అక్టోబర్ 15: హైదరాబాద్ ప్రధాన రహదారి(Hyderabad Main Road) రక్తసిక్తమవుతోంది. బెజ్జంకి మండలంలోని రేగులపల్లి, పోతారం, తోటపల్లి, గుగ్గిళ్ల శివారు నుంచి కోహెడ మండలంలోని శంకర్నగర్ వరకు వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఒకే వారంలో నలుగురు మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ప్రమాదాలకు అడ్డుకట్ట ఎప్పుడు?

వాహనాల రద్దీ, అతివేగం, రాత్రివేళల్లో వెలుతురు లేకపోవడం, రహదారి పక్కన నిలిపే భారీ వాహనాలతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డుకు ఇరువైపులా ఇథనాల్ వాహనాలు

ఇథనాల్ పరిశ్రమలకు వెళ్లే భారీ వాహనాలను రహదారికి ఇరువైపులా నిలిపివేయ డంతో ఇతర వాహనదారులకు  ఇబ్బందులు ఎదురవు తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి, రహదారిపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఒక్క ప్రమాదం.. ఎన్నో కుటుంబాలకు తీరని శోకం

ప్రమాదాల్లో కుటుంబాలకు ఆధారమైన వ్యక్తులను కోల్పోవడంతో పిల్లల చదువులు, కుటుంబ పోషణ భారంగా మారుతున్నాయి. మరో కుటుంబం రోడ్డున పడకముందే అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతాం :ఎస్‌ఐ తిరుపతి

ప్రధాన రహదారిపై ప్రమాదాల నివారణకు కోహెడ ఎస్‌ఐ పుల్లా అభిలాష్తో కలిసి చర్యలు చేపడతామని బెజ్జంకి ఎస్‌ఐ తోట తిరుపతి తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల్లో రాత్రివేళల్లో పెట్రోలింగ్ పెంచడంతో పాటు సీసీ కెమెరాలు, ప్రమాద సూచిక బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. భారీ వాహనాలను నిర్దేశిత పార్కింగ్ స్థలాల్లోనే నిలిపేలా చూస్తామని పేర్కొన్నారు. వాహనదారులు అతివేగంగా, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.

మరిన్ని వార్తలు