హుస్నాబాద్‌కు కబడ్డీ అకాడమీ

16-10-2026 | 10:10pm

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు క్రీడాకారుల కృతజ్ఞతలు

కోహెడ, అక్టోబర్ 16, (విజయక్రాంతి): హుస్నాబాద్‌లో కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. గత 15న ఆర్థిక శాఖ నుంచి జీవో జారైంది. త్వరలోనే అకాడమీ అందుబాటులోకి రానుంది. గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులైన బాల, బాలికలకు మెరుగైన శిక్షణ పొందే అవకాశం కలగనుంది. అకాడమీలో మొత్తం 40 మంది క్రీడాకారులకు అవకాశం కల్పించనున్నారు.

ఇందులో ఇరవైయి మంది బాలురు, ఇరవైయి మంది బాలికలు ఉంటారు. క్రీడాకారులకు శిక్షణతోపాటు వసతి సదుపాయాలు కల్పించనున్నారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా కోచ్‌లను, వార్డెన్లను నియమించడంతో పాటుగా గ్రౌండ్స్‌మెన్‌, స్వీపర్‌, సెక్యూరిటీ గార్డు సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం ఎనిమిది సేవల నియామకానికి అనుమతి లభించగా, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో నియామకాలు చేపట్టనున్నారు. కాగా 

హుస్నాబాద్‌లో కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పై స్థానిక క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. హుస్నాబాద్‌ కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కోచ్‌ కృష్ణ నేతృత్వంలో పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు అంబేడ్కర్‌ చౌరస్తాలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అకాడమీ ఏర్పాటుకు కృషి చేసిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీపై ఆసక్తి ఉన్న బాలబాలికలకు  అకాడమీ ఎంతో ఉపయోగపడనుందని క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీడీ ఆర్‌.శ్రీనివాస్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వి.వెంకటరమణ, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు వెన్న రాజు, పీఈటీలు అజయ్‌, వంశీ, సీనియర్‌ క్రీడాకారులు ఎస్‌.రాజేష్‌, సతీష్‌ వర్మ, సాయికృష్ణ, కత్తుల రఘు, అభినవ్‌, రాంచరణ్‌, అశ్వంత్‌, దిలీప్‌కుమార్‌, లాస్యశ్రీ, శాన్వి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు