ఆరుతడి పంటల తోనే వ్యవసాయం లాభసాటి
కొమురవెల్లి,(విజయక్రాంతి): రైతులు(Farmers) ఆరుతడి పంటల సాగు(Cultivate Dry Crops) చేయడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని మండల వ్యవసాయ అధికారి కుందూరి వెంకట్రావమ్మ అన్నారు. మండల పరిధిలోని గురువన్నపేట గ్రామంలో ఖేత బచావో అభియాన్ - సాగు భూముల సంరక్షణ(Khet Bachao Abhiyan - Conservation of Agricultural Lands)తో పాటు ఆరుతడి పంటలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన సదస్సు ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ... రైతులు భూసార పరిరక్షణపై శ్రద్ధ వహించాలని సూచించారు.
రైతులు నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అందుబాటులో ఉన్న నీటి వనరులు సద్వినియోగం చేసుకుని, తగిన ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని కోరారు. తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఆరుతడి పంటలే శ్రేయస్కరమన్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల రాబోయే రోజులలో భూగర్భ జలాలు అడుగంటి పోయే అవకాశం ఉన్నందువల్ల రైతులు ఆరుతడి పంటల వైపుకు మళ్లాలని సూచించారు. అనంతరం పంటల ఎంపిక, నీటి వనరుల సమర్థ వినియోగం, పంట మార్పిడి విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుడిగి జాంగిర్, ఏఈఓ, రైతులు పాల్గొన్నారు.