7 September, 2026 | 11:57 AM

ఆలయాలే లక్ష్యంగా వరుస చోరీలు

07-09-2026 | 10:56am

సిద్దిపేటరూరల్‌, సెప్టెంబర్ 6: ఆలయాలను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని సిద్దిపేట(Siddipet) రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఆలయంలో చోరీకి యత్నిస్తుండగా శనివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ విద్యాసాగర్‌(CI Vidyasagar) ఎస్ఐ నవత తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. దుబ్బాక మండలం రాజక్కపేటకు చెందిన ఆస సుదర్శన్‌ (35) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో వాటర్‌ ట్యాంక్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా ప్రమాదంలో కుడికాలికి గాయమై సరైన పని లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నారు.

సెప్టెంబరు 1న నాంచారుపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రెండు గంటలు, ఇర్కోడు ఎల్లమ్మ ఆలయంలో పెద్ద, చిన్న గంటలతో పాటు హుండీని చోరీ చేసినట్లు తెలిపారు. హుండీని పగులగొట్టి నగదు తీసుకుని, గంటలను స్క్రాప్‌ దుకాణాల్లో విక్రయించినట్లు వెల్లడించారు. సెప్టెంబరు 4న రాఘవాపూర్‌ ఎల్లమ్మ ఆలయంలో మూడు గంటలు, ముస్తాబాద్‌ మండలం బదనకల్‌ ఎల్లమ్మ ఆలయంలో రెండు గంటలు చోరీ చేసినట్లు తెలిపారు.

బురుగుపల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద మరో చోరీకి యత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి సుజుకి అవెనిస్‌ స్కూటీ (టిఎస్10ఎఫ్సి 7843), వేగా హెల్మెట్‌, రించ్‌ పానా, కొన్ని ఆలయ గంటలను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన సీఐ విద్యాసాగర్‌, దర్యాప్తు అధికారి డి. నవత, ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, కానిస్టేబుళ్లు రాజు, రవికాంత్‌, మల్లేష్‌, నాగరాజు, ప్రవీణ్‌, రాకేష్‌, ప్రదీప్‌, మహేష్‌ తదితరులను సీపీ రష్మీ పెరుమాళ్‌ ఐపీఎస్‌ అభినందించారు.

మరిన్ని వార్తలు