పోలీస్ అమరవీరుల స్ఫూర్తితో గజ్వేల్లో సైకిల్ ర్యాలీ
- స్మార్ట్ఫోన్లకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలను సాధించాలి
- సిఐ రవికుమార్
గజ్వేల్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ మంగళవారం గజ్వేల్ పట్టణంలో పాఠశాల విద్యార్థులతో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్(Police Commissioner Rashmi Perumal), ఐపీఎస్ ఆదేశాల మేరకు గజ్వేల్ సీఐ రవికుమార్, ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ సంయుక్తంగా ర్యాలీని పర్యవేక్షించారు.
స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ బసవేశ్వర విగ్రహం మీదుగా గజ్వేల్ పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ రవికుమార్, ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడమే సంస్మరణ దినోత్సవ ముఖ్య ఉద్దేశమన్నారు.
వారి త్యాగాలను నేటి యువతకు తెలియజేసేందుకే సైకిల్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు స్మార్ట్ఫోన్ల వినియోగాన్ని తగ్గించి, విలువైన సమయాన్ని చదువుకు కేటాయించాలని, క్రమశిక్షణతో కృషి చేస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.