పడిక్కల్ చేజారిన డబుల్

27-10-2026 | 05:10am
  1. అంపైర్ వివాదాస్పద నిర్ణయం
  2. రాణించిన భారత ఏ బ్యాటర్లు
  3. భారత్ ఏ స్కోరు 488/8

లింకోన్, అక్టోబర్ 26 : న్యూజిలాండ్ ఏ జట్టుతో(New Zealand A team) జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు లో భారత ఏ జట్టు(India A team) అద్భుతంగా పుంజుకుం ది. ఇన్నింగ్స్ ఓటమి తప్పదనుకుంటున్న వేళ దేవదత్ పడిక్కల్(Devdutt Padikkal) (199) పోరాటం, సాయి సుదర్శన్, యశ్ రాథోడ్, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీలతో  కోలుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారీస్కోరు సాధించి కివీస్ జట్టుకు సవాల్ విసిరింది. అయితే అద్భుత ఇన్నింగ్స్ ఆడిన పడిక్కల్ తృటిలో డబుల్ సెంచరీ(Double century) చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అతని ఔట్ వివాదాస్పదమైంది.

పడిక్కల్ 199 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా, కివీస్ బౌలర్ జాక్ గిబ్సన్ వేసిన లెగ్ సైడ్ బంతిని ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. బంతి వికెట్ కీపర్ మిచెల్ హే చేతుల్లోకి వెళ్లడంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. దాంతో ఆన్-ఫీల్ అంపైర్ బ్రాడ్ విల్సన్ దీనిని ఔట్‌గా ప్రకటించాడు.బంతి తన బ్యాట్‌కు తగలలేదని, కేవలం ప్యాడ్‌ను మాత్రమే తాకిందని భావించిన పడిక్కల్ అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.ఇది అనధికారిక టెస్ట్ మ్యాచ్ కావడంతో డీఆర్‌ఎస్ అందుబాటులో లేదు.

దీంతో పడిక్కల్ రివ్యూ తీసుకునే అవకాశం లేక నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది.పడిక్కల్ 248 బంతుల్లో 24 ఫోర్లు, 3 సిక్సర్లతో 199 పరుగులు చేసి భారత జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్-ఎ 113 పరుగులకే ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్లో పడిక్కల్, సాయి సుదర్శన్ (91) కలిసి మూడో వికెట్‌కు 215 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు.

యశ్ రాథోడ్(66)తో కలిసి పడిక్కల్ నాలుగో వికెట్‌కు 142 పరుగులు జోడించారు. మూడో రోజు ఆట పూర్తయ్యే సమయానికి భారత్-ఎ 8 వికెట్ల నష్టానికి 488 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(51), ఆకాశ్ దీప్(0) ఉన్నారు.ప్రస్తుతం భారత్-ఎ జట్టు 284 పరుగుల ఆధిక్యంలో ఉంది.

మరిన్ని వార్తలు