విండీస్‌దే రెండో టీ20

10-10-2026 | 05:25am

250 పరుగుల భారీ లక్ష్యం.. తొలి ఓవర్లోనే 2 వికెట్లు డౌన్.. ఇలాంటి పరిస్థితుల్లో ఏ జట్టయినా గెలుస్తుందని అనుకుంటామా.. కానీ వెస్టిండీస్ అద్భుతం చేసింది. కెప్టెన్ షై హోప్ శతక్కొట్టిన వేళ, రూథర్ ఫర్డ్ మెరుపులు మెరిపించిన వేళ మరో 9 బంతులు మిగులుండగానే టార్గెట్ ఛేదించి సిరీస్ సమం చేసింది.

  1. రాంచీలో పరుగుల వరద
  2. 250 టార్గెట్ ఛేదించిన వెస్టిండీస్
  3. హోప్ విధ్వంసకర శతకం
  4. రూథర్ ఫర్డ్ మెరుపులు

రాంచీ, అక్టోబర్ 9: టాస్ ఓడి మొదట బ్యాటింగ్(Batting) చేసిన భారత్‌కు(India) ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 4 ఓవర్లలో 42 పరుగులు జోడించారు. అభిషేక్ శర్మ 20 రన్స్‌కి ఔట్ అయ్యాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న ఓపెనర్ సంజు శాంసన్ ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. 44 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సంజూ ఇచ్చిన మరో కష్టతరమైన క్యాచ్‌ను మిడాఫ్ ఫీల్డర్ వదిలేసాడు.

సంజూ.. 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో భారత్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. మొత్తంగా సంజూ 41 బంతుల్లో 82 పరుగులు (9 ఫోర్లు, 4 సిక్సర్లు) బాది జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ కిషన్ 22 బంతుల్లో 43 పరుగులు చేయగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 18 బంతుల్లో 40 పరుగులు, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కేవలం 18 బంతుల్లోనే 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మెరుపులు మెరిపించారు.

దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోరు సాధించింది. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ 3 వికెట్లు పడగొట్టగా, షమర్ స్ప్రింగర్ 2 వికెట్లు సాధించాడు. 250 పరుగుల భారీ లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. మయాంక్ యాదవ్ వేసిన తొలి ఓవర్లోనే కమిల్ పూరన్(4), షిమ్రాన్ హ్టుమైర్(0) పెవిలియన్ చేరారు. దూకుడుగా ఆడిన రోవ్మన్ పోవెల్(24)ను కూడా మయాంక్ యాదవే క్లీన్ బౌల్ చేశాడు. ఓ వైపు వికెట్లు పడ్డా మరోవైపు షై హోప్ దూకుడుగా ఆడాడు. 

ఈ క్రమంలో షై హోప్ 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. మరోవైపు నిలకడగా ఆడుతున్న షెర్ఫానే రూథర్‌ఫర్డ్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఇచ్చిన సునాయస క్యాచ్‌ను షార్ట్ ఫైన్ లెగ్‌లో మయాంక్ యాదవ్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో అతను ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతన్ని కుల్దీప్ యాదవే ఔట్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

షై హోప్‌తో కలిసి రూథర్‌ఫర్డ్ నాలుగో వికెట్‌కు 120 పరుగులు జోడించాడు. సెంచరీ ముంగిట రూథర్‌ఫర్డ్ ఔటైనా.. రొమారియో షెఫెర్డ్‌తో కలిసి కెప్టెన్ షైహోప్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. విన్నింగ్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించడంతో పాటు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వెస్టిండీస్ 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 252 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.

స్కోరు బోర్డు

వెస్టిండీస్ ఇన్నింగ్స్ : 252/4 (షై హోప్ 102 నాటౌట్, రూథర్ ఫర్డ్ 84, షెపర్డ్ 34; మయాంక్ యాదవ్ 3/36, కుల్దీప్ 1/53)

భారత్ ఇన్నింగ్స్ : 249/4  (సంజూ శాంసన్ 82, తిలక్ వర్మ 44 నాటౌట్, ఇషాన్ కిషన్ 43; చేజ్ 3/24, స్ప్రింగర్ 2/64)

మరిన్ని వార్తలు